హైదరాబాద్: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ, షియామీ గతనెలలో ఏపీలో ఉత్పత్తి ప్రారంభించి మొదటి మొబైల్ – రెడ్మి 2 ప్రైమ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు చేతుల మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైనాకే చెందిన మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ జియోనీ కూడా ఏపీలో తయారీ యూనిట్ పెడుతున్నట్లు ప్రకటించింది. తమ ‘ఎఫ్’ సిరీస్, ‘పి’ సిరీస్ ఫోన్ల తయారీని చిత్తూరుజిల్లాలోని శ్రీ సిటీలో ఉన్న తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు ఔట్‌సోర్స్ చేస్తున్నట్లు జియోనీ సంస్థ భారత ప్రతినిధి అరవింద్ ఓరా చెప్పారు. ఫీచర్ ఫోన్లు, ఇతర స్మార్ట్ ఫోన్లను ఢిల్లీలోని డిక్సాన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి రానున్న అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. భారత్‌లో వచ్చే మూడేళ్ళలో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.
భారత్‌లో తయారీ చేపట్టటంవలన త్వరితగతిన కొత్త మోడల్స్‌ను ఆవిష్కరించగలగటం, దిగుమతి సుంకాలు తగ్గటం వంటి ప్రయోజనాలు కంపెనీకి కలుగుతాయి. ఈ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయటంద్వారా అమ్మకాలు గణనీయంగా పెంచుకోవచ్చని చైనా కంపెనీలు భావిస్తున్నాయి.