లిబియాలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను ఈరోజు రాత్రి ఉగ్రవాదులు విడిచిపెట్టే అవకాశం ఉందని సమాచారం. డిల్లీలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసారు. త్వరలోనే వారిద్దరూ క్షేమంగా హైదరాబాద్ చేరుకొంటారని ఆయన తెలిపారు. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ ఇరువురూ నిన్ననే హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు.
తాము ఉపాద్యయులమని తెలుసుకొన్న ఉగ్రవాదులు తమను చాలా గౌరవంగా చూసుకొన్నారని, తమని పొరపాటున కిడ్నాప్ చేసామని వారే చెప్పారని తెలియజేసారు. బలరాం, గోపీకృష్ణ ఇరువురు కూడా క్షేమంగానే ఉన్నారని వారిని కూడా ఉగ్రవాదులు విడిచి పెట్టేస్తారని నిన్ననే వారు చెప్పారు. వారు చెప్పినట్లుగానే మిగిలిన ఇద్దరినీ కూడా ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఈరోజు రాత్రి విడిచిపెట్టవచ్చునని విదేశాంగ శాఖ అధికారులు తనకి తెలియజేసినట్లు కంబంపాటి తెలిపారు. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో చిక్కి ఈవిధంగా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు బహుశః వీరు నలుగురేనేమో? నిజంగా ఆ నలుగురూ మృత్యుంజయులని చెప్పవచ్చును. వారికి ఇది పునర్జన్మ వంటిది.