పాపం! నాగం జనార్ధన్ రెడ్డి కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి ఎందుకో? ఆయనని తెదేపా నెత్తిన పెట్టుకొన్నప్పటికీ, తెరాస పార్టీలో చేరి తెలంగాణా ఉద్యమాలలో తను పాల్గొనాలనే కోరికతో తెదేపాలో నుండి బయటకు దూకేశారు. కానీ ఆయన ఊహించినట్లుగా కేసీఆర్ ఎర్ర తివాచీ పరిచి పార్టీలోకి ఆహ్వానించలేదు పైగా నాగంకి తెలంగాణా జేఎసిలో కూడా కాలుపెట్టకుండా తన కాలు అడ్డుపెట్టారు. తను ఎలాగు తెరాసలో చేరబోతున్నాననే నమ్మకంతో ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి పోయడంతో, మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేసుకొన్నారు. అటు తెరాసలోను ఎంట్రీ దొరక్క, ఇటు తెలంగాణా జేఎసిలోను దొరక్కపోవడంతో ఆయన తన కోపాన్ని అందుకు కారకుడయిన కేసీఆర్ మీద చూపించారు.
ఆ తరువాత తనే స్వయంగా ఓ స్వంత కుంపటి పెట్టుకొందామని ఊగారు గానీ అది చాలా ఖరీదయిన వ్యవహారమని వెనక్కి తగ్గి ఏదో చిన్న కట్టెల పొయ్యి వంటి ఫోరం పెట్టుకొని కొన్ని రోజులు కాలక్షేపం చేసారు. ఎన్నికల ముందు బీజేపీలోకి చేరడంతో మళ్ళీ తన దశ తిరుగుతుందని ఆశించారు. కానీ అక్కడా ఆయనని పట్టించుకొనేవాళ్ళే కరువయ్యారు. పోనీ డిల్లీ వెళ్దామా…అంటే చాలా దూరం పైగా ఉట్టికే ఎగరలేని వాడు అంటూ మోటు సామెతలు విని భరించాల్సి వస్తుంది.
ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నాగం ఉన్నారు. తన వంటి బలమయిన నేతను ఏ పార్టీలు కూడా ఎందుకు గుర్తించడం లేదో ఆయనకే తెలియడం లేదు. అందుకే మళ్ళీ కట్టెలపొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్నారు. “బచావో తెలంగాణా” అని దానికి ఒక ముద్దుపేరు పెట్టుకొన్నారు కూడా. తను ఇంకా బీజేపీలో ఉండాలో బయటకు జంప్ అవ్వాలో ఇంకా డిసైడ్ చేసుకోకపోవడంతో అంతవరకు ఆ కట్టెల పొయ్యిని ఊదుతూ అగ్గి రాజేసే బాధ్యత తన సహచరుడు ఎన్నెం శ్రీనివాస రెడ్డికి అప్పజెప్పబోతున్నారు. పంద్రాగస్ట్ రోజున పొయ్యి వెలిగించడానికి ముహూర్తం పెట్టుకొన్నట్లు సమాచారం. ఆ హడావుడిలో పడే తన మెహబూబ్ నగర్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి నిర్వహించిన పార్టీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేకపోయారుట. కానీ అక్కడ సమావేశం అవుతున్నట్లు తనకి సమాచారం ఏమీ లేదని నాగం చెప్పారు. నాగంకి సమాచారం ఇవ్వకపోయినా, సమాచారం అంది వెళ్లకపోయినా రెంటి అర్ధం ఒకటే..ఆయనకీ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందని! కారణాలు ఏవయితేనేమి బీజేపీలో నుండి నాగం బయటకు దూకేయడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఒకవేళ తను వెలిగిస్తున్న పొయ్యి సరిగ్గా రాజుకోకపోతే అప్పుడు ఆయన ఏమి చేస్తారో పాపం! నాగం.