హామీల అమలు విషయంలో తేడా వచ్చినప్పుడల్లా తెదేపా నేతలలో ఎవరో ఒకరు లేదా కొందరు కేంద్రం మీద విమర్శలు గుప్పించడం, ఆ తరువాత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని హెచ్చరించడం అంతా ఒక ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పగానే మళ్ళీ అదే తంతు మొదలయింది. ఈసారి తెదేపా (విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్) ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు చంద్రబాబు రేయింబవళ్ళు కష్టపడుతున్నారని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా బీజేపీ వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు నాయుడే చాలా బాగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీని కూడా ఆయన పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఐ పార్టీల చేతుల్లో శివాజీ ఒక పావుగా మారారని, అతనిని అడ్డుపెట్టుకొని ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇంతవరకు తెదేపా నేతలెవరూ కూడా వెంకన్నలాగ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని పేరుపెట్టి ఈవిధంగా విమర్శలు చేయలేదు. కనుక రేపు చంద్రబాబు నాయుడు అతనిని పిలిచి మందలించినట్లు వార్తలు రావచ్చును. నటుడు శివాజీ విషయంలో ఆయన చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ రేపు ఘాటుగా జవాబు ఇవ్వవచ్చును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటాన్ని అధికార పార్టీ విమర్శించినా, వ్యతిరేకించినా దానినే ఆయుధంగా చేసుకొని తెదేపా ప్రభుత్వంపై ప్రయోగించే అవకాశం దానికి దక్కుతుంది.