త్వరలో తెలంగాణాలో నామినేటడ్ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నిన్న ప్రకటించారు. గ్రామజ్యోతి పధకంపై చర్చించేందుకు తెరాస శాసనసభాపక్షం నిన్న తెలంగాణా భవన్ లో సమావేశమయినప్పుడు కేసీఆర్ ఈవిషయం బయటపెట్టారు. ఆషాడం పూర్తయ్యి త్వరలో శ్రావణమాసం మొదలవగానే నామినేటడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం మొదలుపెడతానని ప్రకటించారు. నామినేటడ్ పోస్టులు భర్తీ చేయాలనుకొన్నప్పటికీ మంచి రోజుల కోసమే ఆగవలసి వచ్చిందని ఆయన తెలిపారు.
దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటీలకి చైర్మన్ పోస్టుల భర్తీకి ఎటువంటి ఇబ్బంది లేదని కానీ సుమారు 30-40 కార్పోరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది కనుక వాటి నియమకాలే ఇబ్బందవుతుందని తెలిపారు. అవి కాక రాష్ట్రంలో ఉన్న12 వివిధ కార్పోరేషన్లకు పాలక మండళ్ళను, చైర్మన్ల నియామకాలు చేస్తానని తెలిపారు. పార్టీ స్థాపించబడినప్పటి నుండి నేటి వరకు సేవలందిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా కొత్తగా చేరిన వారికి కూడా అవకాశం కల్పించి పాత, కొత్త నేతల కలయికతో ఈ నామినేటడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. మళ్ళీ వీటిలో కొన్ని పోస్టులకు రిజర్వేషన్ కోటా క్రింద కొన్ని పోస్టులు భర్తీ చేయబడతాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా మంత్రులకు తగిన నేతల పేర్లను సూచించమని కోరినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ సంగతి బయటపెట్టారు కనుక ఇక ఆశావహులు పోస్టుల కోసం తమ ప్రయత్నాలు ముమ్మురం చేయవచ్చును. కానీ పార్టీలో కొత్తగా చేరిన వారికి ఈ పదవులలో కూడా వాటా పెడతానని ఆయన చెప్పడం పార్టీ కోసం చిరకాలంగా పనిచేస్తున్న వారు జీర్ణించుకోవడం కష్టమే. కానీ పార్టీ అవసరాలు, రాజకీయ వ్యూహాలలో భాగంగా కొత్తగా వచ్చిన వారికి కూడా పదవులు ఇవ్వక తప్పదు. ఈ పదవుల పంపకం ముగిసిన తరువాత పదవులు దక్కని పార్టీలో పాతకాపులు అసంతృప్తి చెందడం, అలకలు, బుజ్జగింపులు వగైరాలన్నీ ఎలాగు తప్పవు.