ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న డిల్లీలో ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. ఇకపై రాష్ట్రంలో కూడా దీని కోసం పోరాటాలను ఉదృతం చేయాలని వైకాపా భావిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈనెల 29న ఏపీ బంద్ నిర్వహించాలని నిశ్చయించుకొంది. తాము నిర్వహించబోయే బంద్ కి కాంగ్రెస్, సీపీఐ పార్టీల, ప్రజా సంఘాల మద్దతు కోసం వైకాపా నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆగస్ట్ 28న బంద్ చేయాలని ముందు అనుకొన్నప్పటికీ, ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉన్నందున తమ బంద్ ని మర్నాడుకి వాయిదా వేసుకొన్నామని వైకాపాలో కొత్తగా చేరిన బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే సీపీఐ పార్టీ దీని కోసం ఈనెల 11న రాష్ట్ర బంద్ నిర్వహించింది. దానికి కాంగ్రెస్, వైకాపాలతో సహా ప్రజాసంఘాలన్నీ మద్దతు ఇచ్చాయి కూడా. మళ్ళీ ఇప్పుడు వైకాపా కూడా రాష్ట్ర బంద్ కి సిద్దం అవుతోంది.