టెక్నాలజీకి, నాణ్యమైన వస్తువుల తయారీకి పేరుపొందిన జపాన్ తో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును పట్టాలెక్కించడానికి జపాన్ ఒప్పందం చేసుకుంది. ఇందుకు 98 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి భారత్ సిద్ధపడింది. పౌరు అను విద్యుత్ రంగంలో సహకారానికి జపాన్ సై అని చెప్పింది.
ఓ వైపు పారిస్ లో పర్యావరణ సదస్సు జరుగుతోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. భారత్ ప్రతిపాదలనపైనా పరిశీలన జరుగుతోంది. ఈ సమయంలో అణు విద్యుత్ ప్లాంట్ల కోసం జపాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆశ్చర్యకరం. అణు విద్యుత్ ఎంత ప్రమాదకరమో జపాన్ కు బాగా తెలుసు.
ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. అణు విస్ఫో టనం వల్ల కలిగే వినాశనం మామూలుగా ఉండదు. పైగా అణు విద్యుత్తు ఖరీదు కూడా ఎక్కువే అంటున్నారు. విద్యుత్తును తయారు చేయడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. బొగ్గుతో తయారు చేయడం కాలుష్య కారకం అనుకుంటే సౌర విద్యుత్తు ఎంతైనా తయారు చేసుకోవచ్చు. పవన విద్యుత్తు, ఇంకా అనేక విధాలుగా కరెంటును తయారు చేసుకునే అవకాశం ఉంది.
పవర్ మ్యాన్ గా, పవర్ ఫుల్ మ్యాన్ గా పేరుపొందిన మోడీ హయాంలో ఇలాంటి ఒప్పందం కుదరడమే విస్మయకరం. గుజరాత్ లో తాను ముఖ్యమంత్రి అయిన రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ సరఫరా అనే లక్ష్యాన్ని సాధించారు. బొగ్గు వనరులు లేని ఆ రాష్ట్రంలో గ్యాస్, సోలార్ పవర్ ద్వారా నిరంతర విద్యుత్తును అందించారు. ఇప్పుడు దేశంలో కూడా అలాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంది. అణు విద్యుత్ కేంద్రం అంటే గుండెల మీద కుంపటి లాంటిదే. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో చెప్పలేం.
వీలైనంత వరకు ప్రమాదం లేని, పర్యావరణానికి హాని చేయని ఇంధన వనరులను ప్రజలకు అందించాలి. ఆ దిశగా మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది. జపాన్ సహాయంతో నిర్మించే అణు విద్యుత్ ప్లాంట్లు డిజాస్టర్ ప్రూఫ్ అనే గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. కాబట్టి, ఈ విషయంలో పునరాలోచన చేయడం మంచిదంటున్నారు పర్యావరణ వేత్తలు.