రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే కానీ అధినాయకుల స్థాయిలో వచ్చే ఓటములు మాత్రం జీవితాంతం వెన్నాడుతాయి. కార్యకర్తలను పూర్తిగా నిరుత్సాహపరుస్తాయి. అధినేత వ్యూహ రచనపైన నాయకులకు నమ్మకం పోయేలా చేస్తాయి. విశాఖలో వైఎస్ విజయమ్మ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి జగన్‌కి చాలా కాలమే పట్టింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది అన్న విషయంతో సమానంగా విజయమ్మ ఓటమి కూడా జగన్‌ని బాధపెట్టింది. అందుకే వైఎస్ విజయమ్మను విశాఖలో మేము గెలిపిస్తాం అని ప్రగల్భాలు పలికిన వైసిపీ నాయకులందరినీ తర్వాత కాలంలో దూరం పెట్టేశాడు జగన్. ఆ షాక్‌ని పార్టీ కార్యకర్తలు, నాయకులు మర్చిపోతున్న టైంలో ఇప్పుడు జగన్‌కి మరో సూపర్ షాక్ తగిలింది. ఈ సారి వైఎస్‌ల ఇలాకా అని జగన్ అభిమానులు సగర్వంగా చెప్పుకునే కడపలో కావడం వైసిపి వాళ్ళను ఇంకాస్త బాధించేదే.
టిడిపి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు, విచ్చలవిడిగా డబ్బు పంచారు, క్యాంపు రాజకీయాలు నడిపారు, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు లాంటి డైలాగులు వైసిపి నేతల నోటి నుంచి ఎన్నైనా రావొచ్చు కానీ జగన్ వ్యూహాల వైఫల్యాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవాల్సింది. 2014 ఎన్నికల ఓటమి తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై ఓడిపోయామని జగన్ చెప్పాడు. మరి ఇప్పుడు వైఎస్ వివేకా ఓటమికి ఏం సాకు చెప్తాడో చూడాలి. ఎందుకంటే గెలుపు పైన ఎంతో నమ్మకం ఉంటే తప్ప వైఎస్ ఫ్యామిలీ మెంబర్ని జగన్ బరిలో దింపడని వైకాపా నాయకులే ఎన్నికల సమయంలో చెప్తూ వచ్చారు. అంటే మరోసారి జగన్ నమ్మకం అతి నమ్మకం అయిపోయిందా? లేకపోతే చంద్రబాబు రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనే సత్తా జగన్‌తో పాటు వైసిపి వ్యూహకర్తలకు లేకుండా పోతోందా? చంద్రబాబును ఎదుర్కోగల మొనగాడు జగన్ అని వైసిపి నాయకులు, కార్యకర్తలు అందరూ నమ్మినంత కాలమే జగన్ రాజకీయ భవిష్యత్తు పదిలంగా ఉంటుంది. చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్‌కి లేదు అన్న అనుమానం వైసిపి జనాలకు, ఆ పార్టీ సానుభూతిపరులకు వస్తే మాత్రం జగన్ కెరీర్ అంతటితో క్లోజ్. వైఎస్‌ల ఫ్యామిలీ మెంబర్స్‌ని గెలిపించుకోవడంలో జగన్ ఓడిపోతుండడం మాత్రం పార్టీ క్యాడర్ నమ్మకాన్ని సడలిపోయేలా చేసే విషయమే. మరి చంద్రబాబు రాజకీయ, ఎన్నికల వ్యూహాలను ఎదుర్కునే సామర్థ్యం ఉందని నంద్యాల ఉపఎన్నికతోనైనా జగన్ నిరూపించుకుంటాడేమో చూడాలి.