వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి… చంద్రబాబు ఫోబియా పట్టుకుంది. తన భార్య భారతిపై ఈడీ చార్జిషీటు వేయడం దగ్గర్నుంచి.. తునిలో రైలు తగలబడి పోవడం వరకూ అన్నింటికీ చంద్రబాబుకే కారణం అంటున్నారు. తను పాదయాత్ర చేస్తున్న దారిలో కంటికి ఇంపుగా.. కాస్తంత పెద్ద పరిశ్రమో.. మరొకటే కనిస్తే.. అందులో కాలుష్యం రాకుండా ఉంటుందా.. అని ఆలోచించి.. రెడీమేడ్‌గా విమర్శలు చేసేస్తున్నారు. అవన్నీ చంద్రబాబు బినామీ పరిశ్రమలని తేల్చేస్తున్నారు. తునిలో పాదయాత్ర చేసిన ఆయన… అన్నీ సమస్యలకూ చంద్రబాబే కారణమని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తుని రైలుకు నిప్పు పెట్టిన కేసులో.. వైసీపీపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేత భూమున కరుణాకర్ రెడ్డిని పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు కూడా. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రివర్స్‌లో ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబే రైలు తగులు బెట్టించారని చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే ఇదే సమయంలో రైలు తగులబెట్టి కేసుల్లో ఇరుక్కున్న వారందరిపై కేసులు.. తాను సీఎం అవగానే రద్దు చేస్తానని ప్రకటించారు. పరిశ్రమల విషయంలో జగన్ చాలా విచిత్రమైన వాదన చేస్తున్నారు. కంపెనీలు రావాల్సిన చోట రావాలంటున్నారు. కానీ తునిలో మాత్రం పరిశ్రమలు ఉండకూదట. దివీస్ ఫార్మా గురించి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఫార్మా కంపెనీ వచ్చి ఉంటే అందరం సంతోషించేవాళ్లమన్నారు. మరి అక్కడ ఫార్మా కంపెనీలు పెడితే.. కాలుష్యం ఉండదా..? అనే లాజిక్ మాత్రం.. ఆయన ప్రసంగాల్ని వినే వాళ్లకు వదిలేశారు. తుని పాదయాత్రలో జగన్ అసహనంగా కనిపించారు. ఈడీ చార్జిషీట్ విషయంలో జగన్ చేసిన విమర్శలను టీడీపీ నేతలు ఘాటుగా తిప్పికొట్టారు.
అవినీతి చేసి.. కేసుల్లో ఇరుక్కుని వాటి నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. జగన్ స్వయంగా తన కుటుంబసభ్యులను రోడ్డు, కోర్టులకు ఈడ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంట్లో వాళ్లందర్నీ రోడ్డు మీదకు లాగుతున్న వ్యక్తి రేపు పొరపాటున పాలనా పగ్గాలు చేపడితే పరిస్థితి ఎలా ఉటుందో ఊహించుకోవాలని.. వైసీపీ క్యాడర్‌కు సూచించారు. ఈ అసహనమో.. మరో కారణమో.. కానీ జగన్ మూడీగా కనిపించారు.