వైసీపీ ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని.. నెల్లూరులో శంఖారావ సభకు ముందు వరకూ.. గగ్గోలు పెట్టిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం… టోన్ మార్చింది. ఓట్లను తీసేయాలంటూ వెల్లువలా వచ్చిన దరఖాస్తులన్నీ తమవేనని అంగీకరించారు. ఫామ్ -7లో తప్పేమీ లేదని వాదిస్తున్నారు. ఫామ్ -7 అంటే ఓటును పరిశీలించమనే విజ్ఞప్తి అట. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం.. తమ చట్టం ప్రకారం.. అలా కుట్ర పూరితంగా వేరేవారి ఓట్లను తొలగించాలని ప్రయత్నించడం.. క్రిమినల్ నేరమని భావించి కేసులు పెడుతోంది. ఇప్పటి వరకూ.. 350 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏపీ పోలీసులు చెబుతున్నారు. వీటన్నింటినీ ఎన్నికల సంఘమే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఎవర్నీ వదిలి పెట్టబోమని పదే పదే చెబుతోంది.
ఈ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారంతా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు, బూత్ స్థాయి కార్యకర్తలే. ఒక్కో క్రిమినల్ కేసులో.. ఆయా బూత్‌లలోని ప్రధానమైన వైసీపీ కార్యకర్తలంతా ఉన్నారు. ఇంకా ఇంకా కేసులు నమోదవుతున్నాయి. దరఖాస్తు చేసిన ప్రతి ఫామ్ -7పైనా.. అధికారులు విచారణ జరుపుతున్నారు. ఫేక్ అని తేలిన ప్రతి ఒక్కదానిపైనా కేసులు పెడుతున్నారు. విశాఖపట్నంలో అత్యధికంగా 41, తూర్పుగోదావరిలో 36, పశ్చిమగోదావరిలో 29, ప్రకాశం జిల్లాలో 27కేసులు నమోదు చేశారు. మిగతా జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులలో సాంకేతికంగా దర్యాప్తును ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ సాంకేతిక సిబ్బంది ద్వారా వారి వెబ్ సైట్ కు వెళితే ఎవరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేశారో తెలిసిపోతుందని, వెంటనే అనుమతి ఇవ్వాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు కమిషన్ ను కోరారు. దీనిపై ఏక్షణమైన అనుమతి వస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఈ అక్రమ దరఖాస్తుల పై బూత్ లెవల్ అధికారి స్టేట్ మెంట్ తో పాటు ఎవరి పేరు మీద అయితే చేశారో, వారు తమకు సంబంధం లేదని ఇచ్చిన స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సాంకేతిక సిబ్బంది ఇచ్చే సమాచారం మేరకు ఏ ఐపీ అడ్రస్ నుంచి దరఖాస్తును అప్ లోడ్ చేశారో వారిపై కూడా కేసు నమోదు చేయబోతున్నారు. వారిని ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించిన వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారం తామే చేయించినట్లు జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. అంటే.. స్వయంగా.. క్యాడర్‌ను.. ఈ తరహా నేరానికి ప్రొత్సహించి.. అందర్నీ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునేలా చేశారు జగన్మోహన్ రెడ్డి.