అ.ఆని అంతా హిట్టంటున్నారు. త్రివిక్రమ్ అమోఘం అంటున్నారు. సమంత అద్వితీయం అంటున్నారు. రావు రమేష్ డైలాగులు కేక అంటున్నారు. కొంతమంది మాత్రం.. ఇది ‘మీనా’ నవల అంటున్నారు. విజయ నిర్మల ఆ నవలతో మీనా సినిమాతీస్తే.. త్రివిక్రమ్ పేరు మార్చి డిట్టో దింపేశాడు అంటున్నారు. కథని పోలిన కథలు ఉంటాయిలే అని సర్దుకుపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీనా నవల గురించి త్రివిక్రమ్‌కి బాగా తెలుసు. అది ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ నవల.. అని చాలా సార్లు చెప్పారు. మరి తెలిసి తెలిసి అదే నవలని సినిమా తీయడం ఏమిటి? తీసినా.. టైటిల్ కార్డులో ఆమెకు క్రెడిట్ ఇవ్వకపోవడమేమిటి అన్నది అందరి ప్రశ్న.
ఇలాంటి ప్రశ్న అ.ఆ విడుదలైన తరవాత తప్పకుండా తనకు ఎదురవుతుందని త్రివిక్రమ్‌కీ తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తనున్నాడు. ఈరోజు హైదరాబాద్‌లో అ.ఆ సక్సెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అక్కడడికి మీనా నవల రాసిన యద్దనపూడిని గెస్ట్‌గా పిలిచే అవకాశాలున్నాయని సమాచారం. ఒకవేళ ఆమె రాకపోయినా.. ఇది మీనా నవలకు స్ఫూర్తి అని త్రివిక్రమ్ తొలిసారి నోరు విప్పి చెబుతాడని అందరి మాట. కనీసం ఇప్పటికైనా ఆ నవలా రచయిత్రిని గుర్తించాలనుకోవడం సంతోషమే. ఈ పనేదో ముందు చేసుంటే బాగుండేది.