Yaddanapudi sulochana rani
యద్దనపూడి సులోచనారాణి – ఇప్పటితరం పాఠకులకు వీక్షకులకు ఈ పేరు మరీ అంత పరిచయం అవునో కాదో తెలియదు. అయితే త్రివిక్రమ్ తీసిన “అ ఆ” సినిమా ఆవిడ నవల ఆధారంగానే రూపొందిందని, త్రివిక్రమ్ చాలాసార్లు తన సినిమాల్లో చాలా డైలాగులు ఆవిడ నవలల లోని పాత్రల ప్రేరణతోనే రాశాడని చెబితే, ఇప్పటి తరానికి కాస్త సులువుగా అర్థమవుతుందేమో. అయితే ఒకప్పుడు ఈమె తెలుగు నవల లోకానికి రాణి. ఎన్నో నవలలు మరెన్నో కథలు – అన్ని పాఠకులని మంత్రముగ్ధులను చేసేవే. ఆవిడ రాసిన నవలలు సినిమాలు గా కూడా రూపొందాయి. ఇవాళ ఉదయం అమెరికాలో ఆవిడ తుదిశ్వాస విడిచారు. కాలిఫోర్నియాలోని తన కూతురు నివాసంలో గుండెపోటు తో కన్నుమూశారు. అంత్యక్రియలు కూడా కాలిఫోర్నియాలోని జరగనున్నాయి
ఆగనం, ఆశల శిఖరాలు, ఆత్మీయులు, అగ్నిపూలు, అభిశాపం, ఆహుతి, అమర హృదయం, ఆంధ్ర యువకుడా! దారి ఇటు, బహుమతి, బందీ, బంగారుకలలు, మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విజేత, జై జవాన్, ఆత్మగౌరవం, ప్రేమ దీపిక, గిరిజా కల్యాణం, మౌనపోరాటం, నేను రచయిత్రిని కాను, నీరాజనం, పెళ్లి+పిల్లలు-జీవితం, ప్రేమపీఠం లాంటి ఎన్నో నవలలు ఆవిడ రచించారు. సెక్రటరీ, మీనా లాంటి నవలలు సినిమాలుగా తీశారు. మీనా నవల త్రివిక్రమ్ “అ ఆ” సినిమాకి ఆధారం. అలాగే టీవీలో విస్తృతంగా ప్రేక్షకాదరణ పొందిన రాధ మధు సీరియల్ కు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన “గిరిజా కళ్యాణం” నవల మూల ఆధారం.
మధ్యతరగతి మనస్తత్వాలను ఒడిసిపట్టడంలో, మధ్యతరగతి యువతుల ఊహాలను అక్షరీకరించడం లో సులోచనారాణి కి సరిసాటి తెలుగు నవల లోకంలో ఎవరూ లేరు.