తెలంగాణ సీఎం కేసీఆర్ యజ్ఞయాగాలు చేయడంలో… పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈ పేరును మరింత నిలబెట్టుకునేదిశగా ఈ సారి… అత్యంత భారీ ఎత్తున “మహా సుదర్శన యాగం” నిర్వహించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు.. ఇతర అంశాలపై.. చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి మరీ .. కేసీఆర్ చర్చించారు. యాదాద్రి ఆలయం.. పునర్నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నందున ప్రధానాలయంలో కవచమూర్తుల ప్రతిష్ఠ తదితర అంశాలపై కూడా మాట్లాడారు. యాగానికి సంబంధించి ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. మహాసుదర్శన యాగం.. అత్యంత ఖరీదైనది. కనీసం వంద ఎకరాల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. 1048 యజ్ఞ కుండాలను మహా సుదర్శనంలో ఏర్పాటు చేస్తారు. 3000 మంది రుత్విక్కులు వారికి మరో 3000 మంది సహాయకుల అవసరం అవుతారు. ఈ యాగాన్ని దేశంలోనే చర్చనీయాంశం అయ్యేలా నిర్వహించాలని అనుకుంటున్నారు. ప్రధానితో సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి ఏడాది ఏదో ఓ యాగం చేయడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా వస్తోంది. కొన్నాళ్ల క్రితం విశాఖ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ …శారదా పీఠాధిపతి స్వరూపానందతో… సహస్ర ఆయుత చండీయాగం గురించి చర్చించినట్లు ప్రచారం జరుగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆయుత చండీయాగం నిర్వహించారు. అది దేశంలోనే చర్చనీయాంశమయింది. అత్యంత భారీగా నిర్వహించిన ఆ యగానికి దేశం మొత్తం నుంచి ప్రముఖుల్ని ఆహ్వానించారు. కొనసాగింపుగా సహస్ర ఆయుత చండీయాగం నిర్వహించాలనే ఆలోచన కేసీఆర్‌లో ఉందంటున్నారు. అయితే.. యాదాద్రి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకున్న మహా సుదర్శన యాగం వైపు ప్రస్తుతం మొగ్గు చూపినట్లు అంచనా.
కేసీఆర్‌కు యాగాలపై అమితమైన విశ్వసం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో యాగాలను నిర్వహించిన ఆయన రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చాక కూడా వాటిని జరిపారు. ఎన్నికలకు ముందు తమ వ్యవసాయ క్షేత్రంలో రెండురోజులపాటు రాజశ్యామల యాగం జరిపారు. గెలిచిన తర్వాత కూడా.. తన ఫామ్ హౌస్‌లో చతుర్వేద మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగాన్ని నిర్వహించారు. ఐదు రోజుల పాటు అది జరిగింది. కేసీఆర్‌వి మూఢ నమ్మకాలంటూ.. అనేక విమర్శలు వస్తూంటాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. ఎన్నికల ప్రచారం కేసీఆర్‌ను విమర్శించారు. ఆయన ఉప్పు, నిమ్మకాయని నమ్ముకుంటారంటూ ఎగతాళి చేశారు. దానికి కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. నమ్మకం ఉంటే వచ్చి తీర్థం తీసుకుని పోవాలి కానీ.. తాను యాగాలు చేయడం వల్ల మోడీకి వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించారు.