హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ మంచి పాయింట్లు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన కేసులను సాధారణ వడ్డీ కేసులలాగా చిత్రీకరించి ఆ కేసులను నీరుగారుస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రమేయమున్న కాల్‌మనీ కేసులలో బలహీనమైన సెక్షన్లు పెట్టారని, ఈ కేసుల్లో బెయిల్‌కు కోర్టుకు కూడా వెళ్ళనవసరంలేదని, ఎమ్మెల్సీ సోదరుడికి అలాగే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేశారని జగన్ చెప్పారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్‌తో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్ళి వస్తే, ఆ నిందితుడి ఆచూకీ గురించి పోలీసులు ఎమ్మెల్యేను కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదని ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారం జరిగితే రాష్ట్రమంతటా దాడులు నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. మిగిలిన పార్టీలకు చెందిన వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారని అన్నారు. ఈ ఆరోపణలన్నింటిలో వాస్తవం లేకపోలేదు. కాల్‌మనీ కేసు జరిగింది ప్రధానంగా విజయవాడలో. ఆరోపణలు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపై. అయినా కూడా అది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వ్యవహారంలాగా చిత్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన సాధారణ వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలవారూ ఉన్నారన్న కలర్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు భూముల కేటాయింపులు, రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలకు భూముల కేటాయింపుల గురించి కూడా జగన్ గణాంకాలతో సహా ప్రభుత్వంలో అక్రమాలను వివరించారు.