ముంబై ప్రేలుళ్ళలో దోషి యాకుబ్ మీమన్ ఉరి శిక్షను నిలిపివేసి, దానిని యావజ్జీవ కారాగార శిక్ష మార్చమని కోరుతూ అతని భార్య వేసిన పిటిషన్ని జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్ మరియు అమితావ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణకు స్వీకరించింది. ఇంతవరకు యాకుబ్ తరపున లాయర్ల వాదన విన్న తరువాత ధర్మాసనం ఈకేసును మధ్యహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది. తరువాత సెషన్ లో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదిస్తారు. అనేకమంది పౌరుల మరణానికి కారకుడయిన యాకుబ్ మీమన్ని క్షమించవద్దని ఆయన వాదిస్తున్నారు.
ఇక మరో ఆసక్తికరమయిన పరిణామం ఏమిటంటే యాకుబ్ మీమన్ మళ్ళీ ఈరోజు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకులాగే ఈకేసుపై భిన్నాభిప్రాయం వ్యక్తపరిచే అవకాశం ఉందేమో కానీ రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని మార్చుకోక పోవచ్చును. ఆయన మనసు మార్చుకొని యాకుబ్ మీమన్ కి ఇప్పుడు క్షమాభిక్ష పెట్టినట్లయితే అంతకు ముందు ఆయన తీసుకొన్న నిర్ణయం తప్పని ఆయనే అంగీకరించినట్లవుతుంది. కనుక యాకుబ్ ఈరోజు పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ని ఆయన తిరస్కరించే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. అటువంటప్పుడు యాకుబ్ జీవితం నేడు సుప్రీం తీర్పు పైనే ఆధారపడుందని భావించవచ్చును. ఒకవేళ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం అతని మరణశిక్షని ఖరారు చేసినట్లయితే రేపు ఉదయం అతనికి నాగపూర్ జైల్లో ఉరి తప్పదు.