జగన్మోహన్ రెడ్డితో కేంద్ర మంత్రులు మంతనాలు జరపడాన్ని తెదేపా నేతలు, మంత్రులు అభ్యంతరాలు చెప్పడం అందరూ వింటూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా వారితో గొంతు కలిపి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
“అక్రమాస్తుల కేసులో జగన్ పై సిబీఐ 12 చార్జిషీట్లు కేసులు నమోదు చేస్తే అన్నిటిలో కూడా ఆయన ఏ-1 ముద్దాయిగా ఉన్నారు. 16నెలలు జైల్లో కూడా ఉండి వచ్చారు. అటువంటి ఆర్ధిక నేరస్థుడితో కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు సమావేశం అవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఇటువంటి విషయాలలో ప్రజలకు ప్రభుత్వంపై, న్యాయవ్యవస్థలపై నమ్మకం, గౌరవం కలిగేలా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కొంచెం దూరదృష్టితో వ్యవహరించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో వారు సమావేశం అవకుండా ఉండి ఉంటే బాగుండేది కానీ అందరూ ఆయన గురించి ఏమీ ఎరుగనట్లు మంతనాలు సాగించారు. ఆర్దికనేరాలలో కేసులను ఎదుర్కొంటున్న జగన్, మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. పార్టీ ఫిరాయింపులని మొదట ప్రోత్సహించింది జగన్ తండ్రి డా. రాజశేఖర్ రెడ్డే. కానీ అప్పుడు జగన్ కి అది తప్పుగా కనిపించలేదు. తెలంగాణాలో కూడా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నప్పుడు దాని గురించి జగన్ మాట్లాడరు. కానీ అదే ఆంధ్రాలో జరిగితే డిల్లీ దాక వెళ్లి గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20-30 కోట్ల రూపాయలు ఇచ్చి మేము కొనుకొంటున్నామని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వైఖరితో విసుగెత్తిపోయే అ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు తప్ప వైకాపా ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి తెదేపాలో చేర్చుకోవలసిన అవసరం మాకు లేదు.” అని అన్నారు.
యనమల రామకృష్ణుడు వాదన సహేతుకమా కదా అనే విషయాన్ని పక్కనబెడితే, ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రధాని, కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి, జాతీయ పార్టీల నేతలు అందరూ కూడా అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో సమావేశమయ్యారు. కానీ అప్పుడు తెదేపా నేతలెవరూ ఇంత కంగారు పడలేదు…ఇంతమంది స్పందించలేదు కూడా. మరి ఇప్పుడే ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు…అభ్యంతరాలు చెపుతున్నారంటే జగన్ చేస్తున్న ఆరోపణల వలన జాతీయ స్థాయిలో తమ పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుందనే భయంతోనేనని చెప్పవచ్చు. జగన్ చేస్తున్న ఆరోపణలను చూపించి కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తొక్కిపెడుతుందనే భయంతోనే కావచ్చు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కూడా కలవాలనుకొంటున్నట్లు చెపుతున్నారు. ఒకవేళ వారు కూడా ఆయనకి అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు తెదేపా ఏవిధంగా స్పందిస్తుంది? వేచి చూడాల్సిందే.