వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ నేతలు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం జరిగినా… కచ్చితంగా అది టీడీపీ నేతలు చేశారు కాబట్టి.. తప్పే అన్నట్లుగా వైసీపీతో పాటు.. ఆ పార్టీకి చెందిన మీడియా కూడా ప్రచారం చేసేస్తుంది. ఎవరు ఏమైనా అనుకోని.. అన్నట్లు ఉంటుంది.. పరిస్థితి. తాజాగా మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహారంలోనూ… వైసీపీతో పాటు సాక్షి మీడియా అదే చేస్తోంది. యనమల సింగపూర్లో దంత వైద్యం చేయిచుకున్నారని… ఏపీలో అలాంటి దంత వైద్యం చేసేవాళ్లే లేరా.. అని ప్రశ్నలు గుప్పిస్తోంది. ఏపీలో ఆరోగ్య కార్డులు ఉన్న వాళ్లంతా ఎక్కడ చూపించుకుంటున్నారని.. లాజిక్ లేని ప్రశ్నలు వైసీపీ వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత సమస్యలు ఉండటంతో కొన్నాళ్ల క్రితం.. సింగపూర్ ఆస్పత్రిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దానికి సంబంధించి రూ. 2 లక్షల 88 వేలు ఖర్చయ్యాయి. ఆ బిల్లులు రీఎంబర్స్ చేయాలని…ప్రభుత్వానికి లేఖ పెట్టుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన జీవో… అధికారికంగా విడుదల చేసింది. ఈ జీవోను తీసుకుని.. వైసీపీతో పాటు… సాక్షి, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా.. యనమల దుబారా చేశారన్న ప్రచారాన్ని ఉద్ధృతంగా ప్రారంభించేసింది. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తదితరులకు వైద్యపరంగా ఎంత ఖర్చయితే అంత ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం యనమలకు ప్రభుత్వం బిల్లు చెల్లించింది. ఈ నిబంధనలు కొత్తగా ఉన్నవేమీ కాదు.
వైఎస్ హయంలో.. అసలు చికిత్స తీసుకోకుండానే.. కొంత మంది మంత్రులు లక్షలకు లక్షలు.. ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నిజంగానే అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి శైలజానాధ్ పదవిలో ఉన్నప్పుడు.. కిరణ్ కుమార్ రెడ్డి ఓ సారి రూ. 20 లక్షలు మంజూరు చేశారు కూడా. ఇంకా పదవిలో ఉన్నప్పుడు తాను తీసుకున్న చికిత్సకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని.. వాటి కోసం కొద్ది రోజుల కిందట..సచివాయాలనికి కూడా.. శైలజానాథ్ వచ్చారు. అయినా సరే వైసీపీ మాత్రం.. యనమల పెట్టిన రెండున్నర లక్షల ఖర్చును.. బూతద్దంతో చూపిస్తోంది. అంతకు మించి ఇంకేమీ లేవన్నట్లుగా రాజకీయం చేస్తోంది. రేపోమాపో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తారని.. వైసీపీ హడావుడిపై… టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.