ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైకాపా ఇచ్చిన తీర్మానంపై సభలో చర్చకు తెదేపా ప్రభుత్వం సిద్దం అవగానే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీపై, స్పీకర్ పై సభలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయడానికి 14 రోజుల వ్యవధి కల్పించిందని, ఆ తరువాతనే దానిపై సభలో చర్చ చేపట్టవలసి ఉంటుందని, కానీ తెదేపా ప్రభుత్వం తమ పార్టీలో చేరిన వైకాపా సభ్యులను కాపాడుకోవాలనే తాపత్రయంతో ఆ నిబంధనను యదేచ్చగా ఉల్లంఘిస్తూ నోటీస్ ఇచ్చిన వెంటనే సభలో తీర్మానంపై చర్చ చేపట్టిందని, దానిని అడ్డుకోవలసిన స్పీకర్ కూడా అడ్డుకోకుండా చట్టాన్ని అతిక్రమించారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
“ప్రభుత్వంపై నిన్న మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా స్పీకర్, అధికార పార్టీ ఇదేవిధంగా నియమ నిబంధనలను చట్టాన్ని ఉల్లంఘించి వెంటనే చర్చ మొదలుపెట్టేశారు. ఈరోజు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చట్టసభలలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అందుకే మాకు స్పీకర్ పై కూడా విశ్వాసం పోయింది. అందుకే మేము ఆయనపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసి వచ్చింది,” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మంత్రి యనమల రామకృష్ణుడు దానికి చాలా ధీటుగా జవాబిచ్చారు. “మాపై అవిశ్వాసం పెట్టేది ఆయనే. మళ్ళీ దానిపై చర్చ వద్దనేది ఆయనే. మా ప్రభుత్వంపై, స్పీకర్ పై అవిశ్వాసం ప్రకటించి మళ్ళీ ఆయన ఎందుకు పారిపోతున్నారో తెలియదు. మా ప్రభుత్వంపై, స్పీకర్ పై అవిశ్వాసం ప్రకటించి మళ్ళీ ఆయన ఎందుకు పారిపోతున్నారో తెలియదు. నిజానికి సభలో చర్చించడానికి మేము వెనకాడాలి కానీ మాకు నోటీసు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డే పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన దేని కోసం నోటీసులు ఇచ్చారు? మాపై విశ్వాసం లేదనా? లేకపోతే మా పార్టీలో చేరిన సభ్యులపై అనర్హత వేటు వేయడానికా? ఒకవేళ అనర్హత కోసమే అయితే దాని కోసం ఈ డ్రామా అంత ఎందుకు ఆడుతున్నారు? కేవలం విప్ జారీ చేయడానికయితే, ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఎందుకు? అసలు తన పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలలోకి ఎందుకు వెళ్ళిపోతున్నరో జగన్మోహన్ రెడ్డి తెలుసుకొంటే మంచిది. తన పార్టీలో ఎమ్మెల్యేలను ఆయన లోపల బంధించి తాళాలు వేసుకొని కాపాడుకొంటారో ఎలాగ కాపాడుకొంటాడో అది సభకి అనవసరం. ఆయన పార్టీ వ్యవహారాలతో సభకి సంబంధం లేదు. వాటిని పట్టించుకోనవసరం లేదు,” అని యనమల అన్నారు.
జగన్ లేవనెత్తిన నిబంధనల ఉల్లంఘనలకి జవాబు చెపుతూ “మేమేమీ నియమనిబంధనలు ఉల్లంఘించలేదు. శాసనసభ నియమ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై అత్యవసరంగా చర్చించాలని స్పీకర్ భావించినప్పుడు, రాజ్యాంగంలో ఉన్న రూల్ నెంబర్:71ని పక్కనపెట్టి చర్చకు అనుమతించే అధికారం స్పీకర్ కి ఉంది. దాని ప్రకారమే ఆయన సభలో చర్చకు అనుమతించారు. ఈ నియమం గురించి బహుశః జగన్ కి తెలియదనుకొంటాను. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అయినా మా ప్రభుత్వంపై, స్పీకర్ పై ప్రతిపక్షానికి విశ్వాసం లేదని ఇచ్చిన నోటీసులను మేము చేతిలో పట్టుకొని, ఏమీ జరగనట్లుగా సభ నడపడం మంచి పద్ధతి కాదని ముందుగా సభ విశ్వాసం పొంది ఆ తరువాతనే మిగిలిన వ్యవహారాలు చూద్దామనే ఒక మంచి ఉద్దేశ్యంతోనే చర్చకు అనుమతించారు తప్ప ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాదని ప్రతిపక్ష నాయకుడు గ్రహిస్తే బాగుంటుంది,” అని యనమల రామకృష్ణుడు జవాబు చెపారు.