గత తెలుగుదేశం పాలనపై బురద చల్లే కార్యక్రమం కోసమే శ్వేతపత్రాలు విడుదల చేశారంటూ ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు మాజీ ఆర్థికమంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కి ఏమాత్రం అవగాహన లేదనడానికి ఈ శ్వేతపత్రమే సాక్ష్యమన్నారు. ఒక దేశానికిగానీ రాష్ట్రానికిగానీ కొలమానం ఆర్థికాభివృద్ధే అన్నారు. వ్యక్తుల తలసరి ఆదాయమే కొలమానమన్నారు. రాష్ట్ర విభజన తరువాత చాలా కష్టాల్లో ఇక్కడికి వచ్చామన్నారు. అప్పటికి మన తలసరి ఆదాయం రూ. 93 వేలు ఉండేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేనాటికి తలసరి ఆదాయం రూ. లక్షా 64 వేలు ఉందన్నారు. ఈ స్థాయి అభివృద్ధి ఏ ప్రభుత్వం సాధించిందో చెప్పాలని ఏపీ సర్కారును యనమల ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఇంతకుమించిన కొలమానం ఏం కావాలన్నారు.
రెండు ప్రధానమైన సూచికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తే… ఆయనకి అర్థం కాకపోవడమో, లేదా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమే ఈ శ్వేతపత్రాల్లో కనిపిస్తోందని యనమల విమర్శించారు. వ్యవసాయ అభివృద్ధి విషయంలో అధికారులు ఈయన్ని తప్పదోవ పట్టించారా, లేదా ఆయనే తప్పుగా అర్థం చేసుకున్నారో తనకు తెలియడం లేదన్నారు. వ్యవసాయాభివృద్ధి మైనస్సులో ఉందని చెప్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ఇతర అనుబంధ రంగాలతో కలిపి చూడాలన్నారు. అంతేగానీ, దాని అనుబంధంగా ఉన్న ఒక్కో రంగాన్ని ఒక్కో ప్రత్యేమైనదిగా చూస్తూ దాన్లో అభివృద్ధిని ఎవ్వరూ వెతకరన్నారు. పంటల దిగుబడి అనేది వర్షాధారంతో ముడిపడి ఉంటుందనీ, దాన్లో హెచ్చుతగ్గులు సహజమన్నారు.
రాయలసీమ ప్రాంతంలో సాధారణ పంటలు తగ్గి, హార్టీకల్చర్ బాగా పెరిగిందన్నారు. తగ్గిన దాన్ని పెరిగిన హార్టీకల్చర్ లో సరిచూడాలన్నారు. గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ పెరిగాయి. మరో చోట లైవ్ స్టాక్ (పశు సంపద) పెరిగిందన్నారు. ఇవన్నీ వ్యవసాయ అనుబంధ విభాగాలే అవుతాయన్నారు. ఫిషరీస్, హార్టీకల్చర్ లో అభివృద్ధి బాగా ఉందని వారే చెబుతున్నారనీ, అది జరిగింది టీడీపీలో హయాంలోనే అని వారే ఒప్పుకుంటున్నట్టు కాదా అన్నారు యనమల. నవరత్నాలను అమలు చేయడానికి సాధ్యం కాదనేది ప్రజలకు చెప్పడం కోసమే ఈ గోలంతా అని యనమల విమర్శించారు. పాలన చేతగాకనే డబ్బుల్లేవంటున్నారనీ, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేసిందని గుర్తించాలన్నారు. విభజన తరువాత, ఆదాయమూ లేక, కేంద్ర సాయమూ అందకపోయినా.. టీడీపీ సవాల్ గా తీసుకుని అభివృద్ధి సాధించి చూపించిందన్నారు. అధికార పార్టీ శ్వేత పత్రాలకు గట్టి కౌంటరే ఇచ్చారు యనమల. ఏదేమైనా, వైపాకా ముందు ఏపీ ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాల్ గా ఉందనేది స్పష్టమౌతోంది. దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని పరిష్కరించాల్సిన బాధ్యతా వారిపైనే ఉంటుంది కదా!