తుని నియోజకవర్గానికి పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి.. ప్రభుత్వాల్లో తిరుగులేని నేతగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడు ఇప్పుడుతునిని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఆయన కుమార్తె యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో కిందా మీదా పడుతున్నారు. వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టినా ఏమీ చేయలేకపోతున్నారు.
తుని మున్సిపాలిటీలో గతంలో టీడీపీకి ఒక్క సీటు రాకుండా దాదాపుగా ఏకగ్రీవం చేసుకున్నారు అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. అప్పట్లో కనీస ప్రతిఘటన కూడా యనమల నుంచి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఉపఎన్నిక వచ్చింది. మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో టీడీపీలో చేరిన వారు చేరగా.. మిగిలిన వారిని దాడిశెట్టి రాజా క్యాంపులో ఉంచారు. వారిని ఎన్నికకు రానివ్వడం లేదు.
ప్రతీ సారి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వస్తున్నారు కానీ.. వైసీపీ కౌన్సిలర్లు రావడంలేదు. పైగా చలో తుని అని పిలుపునిచ్చి ఉద్రిక్తతలు రేపుతున్నారు. అయినా వారిని కట్టడి చేయడంలో యనమల విఫలమవుతున్నారు. దాడిశెట్టి రాజా రౌడీయిజానికి ఆయన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే ఆయన సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. ఆయనను కూడా ఆపలేకపోయారు.