నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రపథమంగా స్వాగతించింది మనమే అని గొప్పగా చెప్పుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నగదు రహితాన్ని తొట్టతొలిసారిగా అర్థం చేసుకున్నది ఆంధ్రా సర్కారే అని చెబుతారు. ప్రధామంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అందుకుని, డిజిటల్ ఇండియా సాధనలో భాగంగా వేలిముద్ర బ్యాంకుల్ని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే ప్రారంభించాం అని చెబుతారు! నగదు రహిత లావాదేవీల్లో మనమే ముందున్నాం అంటారు. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ ఆంధ్రాకి వస్తే.. ఆయన సమక్షంలోనే ‘దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మోడీ తీసుకున్న చారిత్రక నిర్ణయం నోట్ల రద్దు’ అని మోశారు! చంద్రబాబు నాయుడు పాయింటాఫ్ వ్యూ నుంచి ఇవన్నీ ఏపీ సాధించిన ఘనతలు. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడా వాస్తవాలను చెబుతున్నది కూడా సాక్షాత్తూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కావడం గమనార్హం!
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆంధ్రాకు బాగా నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. ఎఫ్.ఆర్.బి.ఎమ్. పరిమితిని కేంద్రం నాలుగు శాతం పెంచితే రాష్ట్రానికి బాగుంటుందని ఆయన అన్నారు. అప్పుడే ఆంధ్రాకు కొంత మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందనీ, నవంబర్‌తో పోల్చితే 7.5 శాతం తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక లోటు ఎక్కువగా ఉందనీ, దీన్ని తగ్గించుకోవాలంటే ఖర్చుల్ని నియంత్రించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థికలోటు తీరడానికి ఇదే మార్గమని చెప్పారు.
ఆర్థిక మంత్రి లెక్కలు ఇలా ఉంటే… చంద్రబాబు లెక్కలు ఇంకోలా ఉంటున్నాయి! రాష్ట్రంలో ఇప్పుడు 34 శాతం లావాదేవీలు నగదు రహితంగా జరుగుతున్నాయి చంద్రబాబు అంటున్నారు. మార్చి వచ్చేసరికి 70 శాతానికి నగదు రహిత లావాదేవీల్ని పెంచుతామని చెబుతున్నారు! రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోతోందని యనమల ఆవేదన వ్యక్తం చేస్తుంటే… ఈయనేమో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేనట్టున్నారు! ఎంతసేపూ… కేంద్ర నిర్ణయం ద్వారా తెలుగుదేశం పార్టీకి కొంత మైలేజ్ వస్తుందన్న కోణం నుంచే చంద్రబాబు విశ్లేషించుకుంటూ పోతున్నట్టుగానే ఉన్నారు. అలాగని ఈ క్రమంలో వాస్తవాలకు మసిపూయలేరు కదా! కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలన్నీ ఆదాయాలను కోల్పోయాయని ఆవేదన చెందుతున్నాయి. ఈయన మాత్రం ఏదో సాధించేశామన్నట్టుగా సంబరం చేసుకుంటున్నారు.