టీడీపీ అధికారంలో ఉండగా వైకాపా నుంచి ఫిరాయింపుల్ని బాగానే ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఫిరాయించిన నేతలకు మంత్రి పదవులను కూడా కట్టబెట్టి అందలం ఎక్కించారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయానికి ఈ ఫిరాయింపులే కారణం అనే విశ్లేషణ కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. ఇష్టానుసారంగా వచ్చిన నాయకుల్ని చేర్చుకుంటూ పోయి, ఓపక్క ప్రజల్లో వ్యతిరేకతతోపాటు, సొంత పార్టీకి లాయల్ గా ఉంటూ వస్తున్నవారి అసంతృప్తులను కూడా పార్టీ ఎదుర్కొంది. అయితే, ఈ ఫిరాయింపులపై ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.
ఇతర పార్టీల నుంచి తెచ్చుకునే నాయకుల వల్ల పార్టీ ఎప్పుడూ బలపడదన్నారు యనమల. ఒకవేళ అదే నిజమైతే, మేము 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చాం.. ఏమైందీ, ఎన్నికల ఫలితాల దగ్గరకి వచ్చేసరికి ప్రభుత్వమే పోయిందన్నారు. ఆ పోవడం కూడా భయంకరంగా పోయిందన్నారు. ఈ 23 మందీ ఏం చెయ్యగలిగారు, వాస్తవంలో వారు పార్టీకి చేసిన మేలేంటని అన్నారు. తాను మొదట్నుంచీ చెబుతున్నాననీ, ఫిరాయింపులు అనేవి ఏ పార్టీలోనైనా అంతర్గతంగా సమస్యలకు కారణమౌతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అందర్నీ బయట్నుంచి తెచ్చుకుని బలోపేతం అవుదామనుకుంటే… ఒక జాతీయ పార్టీగా అది చాలా అనైతిక చర్య అవుతుందన్నారు. ప్రజల్లో నిజమైన బలం అనేది ఉంటేనే స్థిరపడతారన్నారు. భాజపాకి వచ్చిన ఓటు శాతం కేవలం 0.5 మాత్రమేననీ, దాన్ని పెంచుకోవాలంటే ఇలాంటి ఫిరాయింపుల వల్ల సాధ్యం కాదన్నారు. నలుగురు ఎంపీలు పార్టీని వీడటం పెద్ద సంక్షోభంగా తాము చూడటం లేదనీ, విధానాలకు కట్టుబడి ఉన్న నాయకులే ఏ పార్టీకైనా అవసరమన్నారు. గెలుపు ఓటములు సహజమనీ, ఈ ఎత్తుపల్లాల్ని టీడీపీ ఎప్పటికప్పుడు అధిగమిస్తుందని స్పష్టం చేశారు.
వైకాపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తమ హయాంలో తీసుకోవడం సరైన నిర్ణయం కాదనే అంశాన్ని బహిరంగానే యనమల చెప్పడం విశేషం. అంతేకాదు, అలా ఫిరాయింపులు ప్రోత్సాహించడాన్ని తాను వ్యతిరేకించాననే మాటలను కూడా అన్యాపదేశంగా చెప్పారు. ఫిరాయింపులు మంచివి కావనేది అనుభవపూర్వంగా టీడీపీకి అర్థమైందని యనమల మాటల్లో అర్థమౌతోంది. అయితే, యనమల తాజా వ్యాఖ్యల్ని టీడీపీలోని ఇతర నేతలు వేరే విధంగా చూసే అవకాశం ఉందా…?