ఎన్నికలు జరిగిన తరువాత ముఖ్యమంత్రి సమీక్షలు, సమావేశాలు నిర్వహించరాదనీ, ప్రభుత్వ ఆస్తులైన కార్ఫరెన్స్ రూములు, ఇతర సౌకర్యాలు వాడుకోవడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందనే వస్తుదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సమావేశ మందిరాల్లో అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చర్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. విజయసాయి రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. ముఖ్యమంత్రి తన నివాసంలోనే ప్రజల సమస్యల మీద సమీక్షలూ సమావేశాలు నిర్వహించుకునే అధికారం ఉంటుందన్నారు.
సీఎం ఎక్కడుంటే అక్కడే సమావేశాలు జరుగుతాయనీ, అదేమీ తప్పు కాదని యనమల స్పష్టం చేశారు. ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కావడంపై విజయసాయి ఫిర్యాదు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. జూన్ తొలివారం వరకూ టీడీపీకి పదవీ కాలం ఉందనీ, అసెంబ్లీ రద్దు కాలేదన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తించాలనీ, ఎన్నికలు ఫలితాలు వచ్చాకనే కొత్త అసెంబ్లీ కొలువు తీరుతుందని తెలుసుకోవాలన్నారు. మరో నేత నక్కా ఆనంద్ బాబు కూడా ఇదే విషయమై మాట్లాడుతూ… ముఖ్యమంత్రి అయిపోతా అంటూ జగన్ పగటి కలలు కంటున్నారనీ, కానీ సీఎం అయ్యే యోగం జగన్ కి లేదన్నారు. మే 23 తరువాత టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రానుందనీ, మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్న తరువాత ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరికొంతమంది టీడీపీ నేతలు కూడా స్పందించి, విజయసాయి ఫిర్యాదుపై విమర్శలు చేశారు.
విజయసాయి చేసిన ఫిర్యాదులో… సమావేశాలు నిర్వహించుకోవడానికి అన్ని పార్టీలకూ అవకాశం ఇవ్వాలని ఈసీని కోరారు. దీనిపై కూడా పలువురు నేతలు విమర్శలు చేశారు. ఎన్నికల తరువాత కూడా టీడీపీ ప్రభుత్వంపై బురదచల్లడమే ఆయన ఉద్దేశమని వ్యాఖ్యానించారు. సరే, ఆ ఫిర్యాదుపై ఈసీ ఏం చేస్తుందనేది కాసేపు పక్కనపెడితే… ఏపీలో ఎన్నికలైతే పూర్తయ్యాయి, కాబట్టి సాధారణ పరిపాలన సాగాలి . ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుని, ఎన్నికలకు ప్రభావితం చేసే అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు సీఎం నిర్వహిస్తున్నది రోజువారీ విధులే అనే విషయం వైకాపా నేతలు తెలియదా..?