మనుషులన్నాక కలలు వుంటాయి.మంత్రులైనా మనుషులే గనక వారికీ కలలుంటాయి. కాకుంటే అవి కాస్త భారీగా వ్యూహాత్మకంగా వుంటాయి. ఎపి క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత అత్యంత ప్రభావశీలుడుగా పేరొందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యసభ కల కూడా అలాటిదే. యనమల సహకారం లేకుంటే చంద్రబాబు 1995 ఆగష్టులో ముఖ్యమంత్రిగా కొనసాగడం అంత సులభమయ్యేది కాదని అందరికీ తెలుసు. అందుకే తర్వాత ఆయన కృతజ్ఞత స్నేహం మేళవించి ఆర్థిక శాఖను ఇస్తూనే వున్నారు.సభా వ్యవహారాలు కూడా చూస్తున్నారు. అయితే ఎంతకాలం ఎన్నిసార్లు ఇదే పదవి చేస్తానన్న అసంతృప్తి యనమలలో చాలా కాలంగా పెరిగిపోతున్నది. నెంబర్ వన్ ఎలాగూ రాదు గనక ఢిల్లీకి వెళ్లి మంత్రి కావచ్చుకదా అని చాలా సార్లు అనుకున్నారు. తనకు పార్లమెంటుకు వెళ్లాలని వుందని బహిరంగంగానే ఆకాంక్ష వెలిబుచ్చారు. నాతోనూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయలేదు. సుజనా చౌదరి పదవీ కాలం ముగిశాక తనను పంపాలని కోరుకున్నారు గాని ఆయన ఆర్థిక వనరులు, కేంద్రంలో బలమైన స్థానంలోవుండటం, బిజెపి నేతలతో సంబంధాల కారణంగా చంద్రబాబు మరోదఫా అవకాశమిచ్చారు. అయితే ఇప్పుడు మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి గనక తనను ఈ దఫా అయినా పంపాలని ఆయన కోరడం, అధినేత ఒప్పుకోవడం జరిగిపోయిందట. ఇప్పుడు శాసనసమండలిలో యనమల స్థానాన్నిఆయన కుమార్తెకు ఇవ్వొచ్చని కొన్ని కథనాలు చెబుతున్నాయి. యనమల రాజ్యసభకు వెళితే ఆరేళ్లు నిరాటంకంగా కొనసాగవచ్చు. తర్వాత కుమార్తె చూసుకుంటారు. ఇటీవల తెలంగాణలో పార్టీ మారిన రేవంత్ రెడ్డి యనమలపై ఆరోపణలుచేసినా ఎవరూ పట్టించుకోకపోవడం తన పట్టును చెబుతుంది. ఆ తర్వాత యాదాద్రి సందర్శనకు వచ్చిన ఆయన కెసిఆర్ ఆ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నందుకు ప్రశంసలు కురిపించి వెళ్లారు కూడా! యనమల కూతురును వాస్తవంలో చంద్రబాబును మెప్పించేందుకు యనమల తమపై అన్యాయంగా దాడి చేస్తున్నారని ఒక దశలో వైఎస్ఆర్సిపి ద్వజమెత్తింది. ఇప్పుడు కూడా యనమలను తప్పించేందుకే ఇదంతా జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. అవన్నీ ఎలా వున్నా తన చిరకాల వాంచ మేరకు యనమల ఢిల్లీ వెళ్లినా ఆశ్చర్యపోనసరవం లేదు.