యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు నవల లోకములో తిరుగులేని రచయిత. అలాగే తెలుగు సినిమాల్లో కూడా తనదైన ముద్రవేసిన రచయిత. శ్రీదేవి మరణ వార్త తెలిసి ఆవిడతో తనకి ఉన్న సాన్నిహిత్యాన్నిపంచుకున్నారు. శ్రీదేవి ని ఓ సినిమాకి ఒప్పించడం కోసం, ఈ సినిమాకు “నువ్వే హీరో” అని చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..
ఆఖరి పోరాటం సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో యండమూరి వీరేంద్రనాథ్ రచన ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా కోసం శ్రీదేవిని సంప్రదించినప్పుడు ఆవిడ, “నాగేశ్వరరావుగారితో హీరోయిన్ గా నేను నటించాను మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తో నటిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా?” అన్న సందేహాన్ని వ్యక్తపరచిందిట. అయితే యండమూరి వీరేంద్రనాథ్ శ్రీదేవి తో “ఈ సినిమాకి నువ్వే హీరో. నాగార్జున సుహాసిని తదితరులంతా ఇతర పాత్రలు మాత్రమే” అని చెప్పి శ్రీదేవిని ఆ సినిమాకు ఒప్పించారట. అయితే ఆ తర్వాత ప్రేక్షకులు కూడా ఆఖరిపోరాటం సినిమాలో శ్రీదేవి హీరో అన్నంతగా తన నటనని ఆదరించారు.
అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు కూడా యండమూరి స్క్రీన్ ప్లే సహకారాన్ని అందించారు.ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో, శ్రీదేవి దేవకన్య అని తెలిసినప్పుడు వచ్చే సన్నివేశాన్ని వీరేంద్రనాథ్ “Dating with an angel” అనే ఒక ఇంగ్లీష్ సినిమాలోని సన్నివేశాల ఆధారంగా రాస్తే ఆ సన్నివేశంలో శ్రీదేవి నటన చూసిన ప్రేక్షకులు నిజంగానే శ్రీదేవి దేవకన్య ఏమో అన్నంతగా మైమరిచిపోయారని అన్నారు యండమూరి వీరేంద్రనాథ్ .
అలాగే తన రచనలో శ్రీదేవి నటించిన మరో సినిమా ఒక రాధా ఇద్దరు కృష్ణులు గురించి చెబుతూ, ఈ సినిమా లో కమల్ హాసన్ శ్రీదేవి ఇద్దరు పోటీపడి నటించడం చూస్తే వారిద్దరి మధ్య నటనలో ఏదో మల్లయుద్ధం జరుగుతున్నట్టుగా అనిపించింది అన్నారు. ఎంతో మంది హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే స్టార్ లాగా ప్రవర్తిస్తే శ్రీదేవి మాత్రం ఎప్పుడూ ఆర్టిస్ట్ లాగానే ప్రవర్తించిందని అన్నారు.
ఏదేమైనా యండమూరి “ప్రవల్లిక” నిజంగానే అభిమానులని “పజిల్” లో పడేసి దివికెగసిపోయింది.