గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకే జగన్ టిక్కెట్ ఇస్తారని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తాను గన్నవరాన్ని వదిలే ప్రసక్తే లేదని గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. ఆయన ఇటీవల యాక్టివ్ అయ్యారు. తనను జగన్ రెడ్డి అమెరికా నుంచి తీసుకు వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద వదిలేస్తారని అనుకోవడం లేదని మీడియాతో చెబుతున్నారు.
పెనమలూరు సీటు ఇస్తా అని జగన్ అంటే నేను ఇండియా వచ్చాననని చెబుతున్నారు. తర్వాత గన్నవరం సీటు నుంచి జగన్ పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేసానని వివరించారు. గన్నవరం లో వైసీపీని పటిష్టం చేశానని.. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా ఓటమి పాలయ్యాని చెప్పారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. నేను గెలిచి ఉంటే నియోజక వర్గానికి ఈ ఖర్మ ఉండేది కాదని.. కొన్ని కారణాలతో గన్నవరంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజక వర్గానికి కాదన్నారు. జగన్ నాకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని .. వదులుకునే ప్రశ్నే లేదని అంటున్నారు.
యార్లగడ్డ వెంకట్రావు కొన్నాళ్లుగా వేరే పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా అదే ప్రయత్నంలో ఉన్నారని.. అందుకే జగన్ రెడ్డి తనను తీసుకొచ్చి మోసం చేశారన్న భావన అందరికీ కలిగేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వంశీకి గన్నవరంలోనే మరో ప్రత్యర్థి ఉన్నారు. ఆయనే దుట్టా రామచంద్రరావు. టీడీపీ నుంచి వచ్చిన వారు తప్ప.. ఇంకెవరూ వంశీ వెంట లేరు. దీంతో గన్నవరంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.