కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పోలింగ్ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. ఆయనకు..నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నుంచి బెదిరింపులు వచ్చాయని… దాంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత… బిందాస్ అనుకున్న వంశీ… ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని… అంతే జోరుగా…పోలింగ్ ప్రక్రియను కూడా ముగించారు. అయితే.. ఇప్పుడు ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు … విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి .. వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏమిటంటే… వంశీ తనకు సన్మానం చేస్తానన్నాడని… తన ఇంటికి కూడా వచ్చాడనేది ఆ ఫిర్యాదు సారాంశం.
ఎన్నికల ప్రచారంలో యార్లగడ్డ వెంకట్రావు అందరిలాగే.. తన ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా… విమర్శలు చేశారు. అయితే… పద్దతిగా చెప్పుకోవడానికి అవి విమర్శలు కానీ.. మామూలుగా అయితే .. తిట్లు అనుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న వంశీ.. ఎన్నికలు అయిపోయిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావుకు ఫోన్ చేసి.. ఎన్నికల ప్రచారంలో… తనను, చంద్రబాబును తిట్టావు కాబట్టి.. నీకు సన్మానం చేయాల్సి ఉందని అన్నారట. తనకు ఏ సన్మానాలు అవసరం లేదు.. తాను కలవనని చెప్పి.. వెంకట్రావు ఫోన్ పెట్టేశారట. అయితే… వల్లభనేని వంశీ వదిలి పెట్టలేదు. ఓ సారి సమయం చూసుకుని యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లారు. కానీ ఆయన లేరు. దాంతో.. తాను వచ్చి వెళ్లానని చెప్పమని… వాచ్‌మెన్‌కు చెప్పి వెళ్లారట. దాంతో వెంకట్రావు.. వెంటనే .. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వంశీ తన ఇంటికి వచ్చిన సీసీ టీవీ ఫుటేజీని సమర్పించారు.
వంశీ తన ఇంటికి వచ్చి .. సన్మానం చేస్తానంటున్నారని.. తానే వంశీ ఇంటికి వెళ్తానని.. తనకు గన్ మెన్ల రక్షణ కల్పించాలని యార్లగడ్డ వెంకట్రావు సీపీ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన… మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు కూడా సీపీని కలిసి.. వంశీ తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. నిజంగానే.. వల్లభనేని వంశీ సన్మానం చేయాలనుకున్నారా లేక.. సన్మానం పేరుతో దాడి చేయాలనుకున్నారా.. అనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.