వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు సిద్ధం కావడంతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆందోళన ప్రారంభించారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు అనుచరులతో సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ తమను చాలా ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే.. తమ పరిస్థితేమిటని ప్రశ్నించారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంశీ .. జగన్ తో సమావేశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని… యార్లగడ్డ చెబుతున్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించానని ఆయన చెబుతున్నారు. వంశీపై తాను ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదని … ఇళ్ల పట్టాల విషయంలో రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
సీఎం జగన్ను కలిసి గన్నవరంలో పరిణామాలన్ని వివరిస్తానని .. వైసీపీలో వంశీ చేరికపై జగన్ను కలిశాక స్పందిస్తానని ప్రకటించారు. వంశీ వల్ల వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వంశీ చేరికను నియోజకవర్గ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని వెంకట్రావు తేల్చేశారు. గన్నవరంలో ఓడిపోయినప్పటికీ.. వైసీపీ అధికారంలోకి రావడంతో… యార్లగడ్డ వెంకట్రావే అనధికార ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్నారు. తాను కోరిన అధికారుల్నే నియమించుకున్నారు. వంశీ హయాంలో ఉన్న అధికారులు, పోలీసుల్ని కూడా బదిలీ చేయించారు.
ఈ క్రమంలో మళ్లీ వంశీ వైసీపీలోకి వస్తూండటంతో.. ఆయన తన స్థానం ఎక్కడ పోతుందోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ విధానం ప్రకారం వంశీ రాజీనామా చేయక తప్పదని.. అప్పుడు వైసీపీ టిక్కెట్ ఆయనకే ఇస్తారని యార్లగడ్డ భావిస్తున్నారు. అందుకే.. హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఈ విషయంలో ముందు ముందు.. గన్నవరంలో రాజకీయం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.