గన్నవరం లోకేష్ పాదయాత్ర సభలో టీడీపీలో చేరాలని యార్లగడ్డ వెంకట్రావు నిర్ణయించుకున్నారు. చంద్రబాబుతో ఆదివారం భేటీ అవుతారు. ఈ నెల 22న గన్నవరం జరగబోయే భారీ బహిరంగ సభలో యార్లగడ్డ టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి యార్లగడ్డ బలమైన అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వంశీకి వ్యతిరేకంగా పోటీ చేయడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా క్యాడర్ ఉంది.
టీడీపీలో చేరితే వంశీపై పోటీచేసేది ఈయనేనని.. ఇందుకు చంద్రబాబు సమ్మతంగానే ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో పెనమలూరు నియోజకవర్గ కేంద్రంగా వైసీపీ నుంచి రాజకీయం ప్రారంభించారు. 2019లో పెనమలూరు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన వెంకట్రావు అధిష్ఠానం ఆదేశాల మేరకు గన్నవరం నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి వంశీ చేతిలో సుమారు 300 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తొలి నుంచీ వంశీ అంటే ఉప్పు నిప్పుగా ఉండే వెంకట్రావు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు.
వంశీ వైసీపీ పంచన చేరడం 2024లోనూ ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇవ్వడంతో వెంకట్రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంతకాలం వేచి చూసినా వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం.. పోతే పో.. అన్నట్టు నేతలు వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన వెంకట్రావు ఎట్టకేలకు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. యార్లగడ్డకు టీడీపీ టికెట్ ఇస్తే 2019లో పోటీ పడిన ప్రత్యర్థులై మళ్లీ బరిలో నిలుస్తారా కానీ పార్టీలే వేరు వేరు.