‘కేజీఎఫ్’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొన్నాడు యష్. కేజీఎఫ్ తరవాత ఎలాంటి సినిమాలో నటించబోతున్నాడంటూ ఓ ఆసక్తి మొదలైంది. ఆయన కథానాయకుడిగా ‘టాక్సిక్’ అనే చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. కేజీఎఫ్ తరవాత వస్తున్న సినిమా కాబట్టి, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదాలకెక్కింది.
‘టాక్సీక్’ షూటింగ్ కర్ణాటక సరిహద్దుల్లోని హెచ్.ఎం.టీ ప్లానిటేషన్‌లో జరుగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతమిది. ఇక్కడ ఓ భారీ సెట్ వేసింది చిత్రబృందం. అయితే ఆ సెట్ కోసం వందలాది చెట్లు నరికేశారన్నది ఆరోపణ. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అటవీ శాఖ అధికారులు ఈ సెట్ ని, షూటింగ్ జరుగుతున్న ప్రదేశాన్నీ పరిశీలించారు. గతంలో అక్కడ భారీగా చెట్లు ఉండేవని, ఇప్పుడు మాయం అయ్యాయన్న నిర్దారణకు వచ్చారు. చివరికి కర్ణాటక అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే సైతం ఈ సెట్ వేసిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఏం జరిగింది? ఇది వరకు ఏ మేరకు చెట్లు ఉండేవి? ఈ సినిమా కోసం ఎన్ని చెట్లు నరికేశారన్న విషయంపై ఆయన దగ్గరుండి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తీసిన శాటిలైట్ చిత్రాల్లో భారీగా చెట్లు కనిపించాయి. ఇప్పుడు అవన్నీ మాయం అయ్యాయి. ఈ ప్రాంతంలో చెట్లు తొలగించాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. అసలు ఈ షూటింగ్ కు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్లు తీసుకొన్న జాగ్రత్తలేంటి? ప్రభుత్వ అధికారుల ప్రమేయంతోనే చెట్లు నరికేశారా, లేదంటే ఇదంతా చిత్రబృందం నిర్వాకమా? అనే విషయంపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. బాధ్యులెవరైనా సరే, తగిన చర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే ఈ సెట్ కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. అటవీ శాఖ ఆ సెట్ ని తొలగిస్తే నిర్మాతలకు భారీ నష్టం తప్పదు.