విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అదరగొట్టాడు. డబుల్ సెంచరీ (209) సాధించి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓవర్‌నైట్ స్కోరు 177 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన జైస్వాల్ అదే జోరుతో… డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. చివరికి ఆండర్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జైస్వాల్ కు ఇదే తొలి డబుల్ సెంచరీ. అతి తక్కువ వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా యశస్వీ రికార్డు సృష్టించాడు. వినోద్ కాంబ్లీ, సునీల్ గవస్కర్ జైస్వాల్ కంటే ముందే ఈ ఘనత సాధించారు.
జైస్వాల్ అవుట్ అవ్వగానే మిగిలిన వికెట్లనూ భారత్ త్వరగా కోల్పోయి చివరికి 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్, ఆండర్సన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో ఈ టెస్ట్ లో విజయం సాధించడం చాలా అవసరం. రెండో రోజు నుంచే ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అశ్విన్, కులదీప్, అక్షర్ పటేల్‌ల త్రయం ఇంగ్లండ్ ని ఎంత తొందరగా కట్టడి చేస్తుందన్నదానిపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.