హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న సిరియా ఉగ్రవాదసంస్థ ఐఎస్ఐఎస్ హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దిల్సుఖ్నగర్, బెంగళూరు, పూణే నగరాలలో బాంబు పేలుళ్ళు జరిపిన ఇండియన్ ముజాహదీన్ తీవ్రవాదసంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ చర్లపల్లి జైలునుంచి తప్పించుకోటానికి వ్యూహాలు పన్నుతున్నట్లు ఇటీవల బయటపడింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భత్కల్ తన భార్య జహీదాకు చేసిన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేయగా దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఐఎస్ఐఎస్ సాయంతో త్వరలో తాను బయటకొస్తానని భత్కల్ తన భార్యకు చెప్పాడు. జైలులో ఖైదీలు మాట్లాడుకోటానికి ఏర్పాటు చేసిన అధికారిక ఫోన్నుంచే అతను ఈ కాల్ చేయటం విశేషం. ఈ కాల్ డేటాను జైలు అధికారులు నేర పరిశోధనాసంస్థ ఎన్ఐఏకు అందజేశారు. ఐఎస్ఐస్ సంస్థ సిరియా, ఇరాక్లలో సృష్టిస్తున్న విలయం అందరికీ తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు చర్లపల్లి జైలు అధికారులను అప్రమత్తం చేయటంతో వారు జైలువద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భత్కల్ను విడిపించటంకోసం ఎవరైనా పెద్దనేతను కిడ్నాప్ చేయటంగానీ, విమానాన్ని హైజాక్ చేయటంగానీ చేయొచ్చని ఐబీ సంస్థ గతఏడాదికూడా హెచ్చరికలు జారీచేసింది.