ఆర్జీవీ తీసిన ‘వ్యూహం’ చుట్టూ ఎన్నో వివాదాలు. ఇంకెన్నో ప్రశ్నలు. కొన్ని పార్టీల్నీ, నాయకుల్ని కార్నర్ చేయడానికే ఆ సినిమా తీశారన్నది సుస్పష్టం. చివరికి ఈ సినిమాపై కోర్టు స్టే తెచ్చుకొంది టీడీపీ. నిజానికి… టీడీపీ దృష్టి పెట్టాల్సింది ‘వ్యూహం’పై కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ‘యాత్ర 2’ కూడా ఎన్నికల సమయంలోనే విడుదల అవుతోంది. ఆర్జీవి మేకింగ్ స్టైల్ గురించి తెలిసినవాళ్లెవరూ ఆర్జీవి సినిమాల్ని చూసి భయపడరు. ఎందుకంటే జన బాహుళ్యంలో ఉన్న పాయింట్లే తీసుకొని, ఆర్జీవీ దానికి తనదైన ఫిక్షన్ జోడించి, వైకాపాకి అనుకూలంగా మలచుకొంటాడు. అందులో ఉన్న నిజానిజాలెంతో… చూసే జనానికి తెలుసు. పైగా సినిమాని చీప్‌గా చుట్టేస్తాడు. జూ.ఆర్టిస్టుల్లాంటి నటీనటుల్ని తెరపైకి తీసుకొస్తాడు. ఆర్జీవీ సినిమా తీశాడు చూద్దాం పదండి అన్నంత వైబ్ తెలుగు ప్రేక్షకుల్లో లేనే లేదు. పైగా.. తన సినిమాలపై ఒకరకమైన విరక్తి భావం వచ్చేసింది. పైగా వైకాపా కోసం సినిమా తీసినట్టే అనిపించినా, తన స్వలాభం చూసుకొంటాడు. ఇదంతా వర్మ బిజినెస్ స్ట్రాటజీ.
‘యాత్ర 2’ అలా కాదు. దీనికి మహీ రాఘవ దర్శకుడు. తనో క్లాస్ డైరెక్టర్. ‘యాత్ర’ సినిమాని వైకాపా అంటే ఇష్టపడని వాళ్లు సైతం మెచ్చుకొనేలా తీయగలిగాడు. ‘యాత్ర 2’ వైకాపాకి తప్పకుండా ఫేవర్ చేస్తుంది. ఇందులో సందేహం లేదు. కాకపోతే.. మిగిలిన పార్టీలకూ ఈ సినిమా డామేజింగ్ ఫ్యాక్టర్‌గానే కనిపిస్తోంది. చంద్రబాబు, సోనియాలను పోలిన పాత్రలు ‘యాత్ర 2’లోనూ ఉన్నాయి. వైఎస్ఆర్, జగన్ లపై చంద్రబాబు, సోనియా కుట్ర పన్నుతున్నట్టు టీజర్‌లో చూపించారు. ఇక సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో తెలీదు. ఇదంతా కేవలం వైకాపాకి సానుభూతి చేకూర్చాలన్న ప్రయత్నమే. పైగా సరిగ్గా ఎన్నికలకు ముందు వస్తోంది. దానికి తోడు మహి.వి రాఘవ మేకింగ్ లో క్వాలిటీ ఉంటుంది. డ్రామాని ఎలా పండించాలో తెలుసు. తెలిసిన నటీనటుల్ని తెరపైకి తీసుకొస్తాడు. ‘వ్యూహం’ కంటే.. ఎక్కువ ఇంపాక్ట్ సృష్టించే సినిమాని అందివ్వగలడు. అలాంటప్పుడు ‘వ్యూహం’ని ఆపితే ఏం లాభం? జనమంతా ఆర్జీవీ `వ్యూహం` గురించి మాట్లాడుకొంటుంటే, సైలెంట్ గా ‘యాత్ర 2’ని రంగంలోకి దింపేయొచ్చు. బహుశా… వైకాపా అసలైన ‘వ్యూహం’ ఇదేనేమో..?