Yatra 2 movie telugu review
తెలుగు360 రేటింగ్ : 2.5/5
-అన్వర్
కథ వేరు. నిజ జీవిత కథ వేరు. కథలన్నీ కల్పితమే. ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ నిజ జీవిత కథల్లో… కథలుండకూడదు. నిజాలే కనిపించాలి. చరిత్రని వక్రీకరించడం, అబద్ధాన్ని గ్లోరిఫై చేయడం, మోసాన్ని, అవినీతిని అందంగా ఆవిష్కరించడం బయోపిక్ అనుకొంటే మాత్రం ‘యాత్ర 2’ లాంటి కథలే వస్తాయి. ‘యాత్ర’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆవిష్కరించిన మహి.వి. రాఘవ.. ఇప్పుడు ‘యాత్ర 2’లో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ‘కథ’ని మాత్రమే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అదెలా జరిగింది? ఈ కథలో ఉన్న కట్టు కథలేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి?
హెలీకాఫ్టర్ మరణంలో వైఎస్సార్ (మమ్ముట్టి) చనిపోవడంతో ఆయన్ని అభిమానించే ఎన్నో వేల గుండెలు ఆగిపోతాయి. వాళ్లని ఓదార్చడానికి వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి (జీవా) ఓదార్పు యాత్ర ప్రారంభిస్తాడు. ఆ యాత్రలో జగన్‌కి వస్తున్న పాపులారిటీ చూసి ఢిల్లీ నాయకత్వం బెదిరిపోతుంది. ఎలాగైనా యాత్రని ఆపాలని ప్రయత్నిస్తారు. ఢిల్లీ పెద్దల్ని ఎదిరించి, యాత్ర కొనసాగిస్తాడు జగన్. దాంతో పోగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్‌ని బెదిరిస్తుంది. దాంతో పోగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి భారీ మోజార్టీతో గెలుస్తాడు జగన్. దాంతో.. మేడమ్ (సోనియా అన్నమాట) ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటుంది. జగన్‌పై అక్రమ ఆస్తుల కేసు బనాయించి జైలు పాలు చేయిస్తుంది. ఆ తరవాత ఎలాంటి పరిణామాలు సంభవించాయి? జగన్ జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడు? 2019 ఎన్నికల్లో ఎలా గెలిచాడు? అసలు 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాలి.
ఈ కథ గురించి మహి.విరాఘవ ఎక్కువ కసరత్తు చేయాల్సిన పనిలేదు. సాక్షి పేపర్లు ముందు పెట్టుకొని, వాటిలో వచ్చిన వార్తలు, వండిన కథనాలూ సీన్లుగా రాసుకొంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఎంత బయోపిక్ అయినా… సినిమా వన్ సైడ్ వార్‌లా ఉండకూడదు. ఒక వైపే నిలబడి మాట్లాడకూడదు. నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్ముండాలి. చేసిన తప్పుల్ని కూడా చూపించగలిగే తెగింపు ఉండాలి. అవేం… ‘యాత్ర 2’లో కనిపించలేదు. కేవలం జగన్‌ని గ్లోరిఫై చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఉపయోగపడడానికి తయారు చేసిన కర పత్రంలా ఈ సినిమాని ఉపయోగించుకొన్నారంతే. వాళ్లకేం కావాలో అదే రాసుకొన్నారు. అదే చూపించారు. సినిమా మొత్తం తీసి, మళ్లీ జగన్‌కి చూపించి, ఆయనకు ఇబ్బంది కలిగించే సన్నివేశాల్నీ, పాత్రల్నీ, సంభాషణల్నీ మళ్లీ ఎడిట్ చేసి, చివరికి వదిలిన సినిమాలా కనిపించింది ఈ యాత్ర.
వైఎస్సార్ (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం నుంచి `యాత్ర 2` మొదలైంది. పోగ్రెస్ పార్టీని ధిక్కరించి ముందుకెళ్లడం, ఇదంతా చూస్తూ మేడమ్ (సోనియా) రగిలిపోవడం, ఆ తరవాత హెలీకాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడం.. ఇలా సన్నివేశాలు ముందుకు సాగుతాయి. జగన్ పోగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో గెలవడం.. ఇలా కథ ఊపందుకొంటుంది. అయితే ఇక్కడో గమ్మత్తు ఉంది. ఉప ఎన్నికల్లో జగన్ గెలవడానికి తనపై ప్రజల నమ్మకమే అని చెప్పుకొని, కేవలం రైతు రుణమాఫీ అనే హమీ ఇవ్వకపోవడం వల్లే 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు అని చెప్పడం చాలా సిల్లీగా ఉంది. నెరవేర్చని హామీలను ఇవ్వకూడదు అని జగన్ భావిస్తే.. 2019 ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి దానికి జగన్ దగ్గర కానీ, వైకాపా దగ్గర కానీ సమాధానం ఉందా..? కేంద్రం మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా సాధిస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లిన జగన్ మరి ఆ మాటని ఎందుకు నిలబెట్టుకోలేదు. అది మడమ తిప్పినట్టు కాదా..?
జగన్‌కి ఏం కావాలో, ఆ పార్టీకి ఏది ఉపయోగమో అది మాత్రమే చూపించడం బయోపిక్ అనే పదానికి ఈ సినిమాని పూర్తిగా దూరం చేసింది. అన్న వదిలిన బాణం షర్మిలని ఎందుకు చూపించలేదు? అంటే ఇప్పుడు ఆమె… అన్నతో కలిసి లేదనా? అన్న పక్షాన నిలబడలేదనా? అన్న చేసిన తప్పులన్నీ ఎత్తి చూపుతోందనా? కనీసం ఆ పేరే ఎత్తకుండా చేసుకొన్నారే..!
కోడి కత్తి ఉదంతం ఎక్కడ? బాబాయ్ ని హత్య చేసిన ఎపిసోడ్ ఎక్కడ? అని అడిగితే ఏం సమాధానం చెబుతారు? 2019 ఎన్నికల ముందు ఇవన్నీ ఏపీలో జరిగిన కీలక పరిణామాలు కదా? అంతెందుకు? కనీసం ‘జనసేన’ పార్టీ పేరు ఎత్తడానికి మహి.వి.రాఘవ భయపడ్డట్టు అనిపిస్తుంది. జగన్‌కి సైతం.. జనసేన అనే పేరు పలకడం, పవన్ కల్యాణ్ అని ఉచ్ఛరించడం అస్సలు నచ్చవు. అందుకే మహి.. వాటి జోలికి పోలేదు. కాంగ్రెస్‌ని పోగ్రెస్ అని మార్చిన మహి.. చంద్రబాబు నాయుడు పేరుని మాత్రం యధాతధంగా ఎలా వాడుకొన్నాడు? అంటే ఓ వ్యక్తి పరువు తీయడానికో, వాళ్లపై బురద చల్లడానికో.. చేసిన సినిమా ఇదని రూఢీ అయిపోయినట్టేనా?
జగన్ ని ఎదగనివ్వకుండా చేయాలి? అని సోనియా అనుకొన్నట్టు, అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ని ఇరికించమని చంద్రబాబు సోనియాకే సలహా ఇచ్చినట్టు చూపించడం.. అబద్ధాన్ని నిజంగా, అదే చరిత్రగా నమ్మించాలనుకోవడమే కదా? చంద్రబాబుని దోషిగా చూపించడానికి మహి ఏం రాయాలో అన్నీ రాసేసుకొన్నాడు. ఆయన్ని ఓ కుట్ర పూరితమైన రాజకీయ నాయకుడిగా చిత్రించేందుకు చరిత్రని వక్రీకరించడానికి కూడా వెనుకంజ వేయలేదు. అసలు జగన్ అంత ఉత్తముడు, శాంతికాముకుడు లేనట్టు చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. జగన్ వైఖరి తెలిసినవాళ్లెవరికైనా జోక్‌గా అనిపిస్తుంది. జగన్‌ని ఎలివేట్ చేయడానికి దర్శకుడు అన్ని రకాల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొన్నాడు. రాజశేఖర్ రెడ్డి ప్రమాదం జరిగిన స్థలానికి జగన్ వెళ్లినట్టు, అక్కడ ఓ కాలీ కాలని డైరీ దొరికినట్టు, అందులో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో – అనే వాక్యం తనని కదిలించినట్టు, సమాధి దగ్గర రాత్రంతా జగన్ పడుకొన్నట్టు, పెద్దాయన కల్లోకి వచ్చి హితబోధ చేసినట్టు ఇలా… ఏవేవో రాసుకొన్నాడు మహి. అన్నింటికంటే ముఖ్య విషయం. సినిమా అంతా ‘నేను వైఎస్సార్ కొడుకుని రా’ అని జగన్ పదే పదే చెప్పుకొన్నట్టు చూపించారు. ఎన్నికల ముందు వరకూ జగన్ చేసింది అదే. కానీ ఆ తరవాత.. క్రమంగా వైఎస్సార్ పేరు కానీ, ఆయన ఫొటో గానీ.. ప్రచారంలో ఎక్కడా కనిపించకుండా చేశారు. అదంతా వైఎస్సార్‌ని నిజంగా అభిమానించేవాళ్లు, పార్టీలకు అతీతంగా ఆరాధించిన వాళ్లు గమనించకపోరు.
యాత్ర… వైకాపా అభిమానులకే కాదు, సామాన్య ప్రేక్షకులకూ నచ్చిందంటే కారణం ఆ కథలోని ఎమోషన్. అదే `యాత్ర 2`లో మిస్ అయ్యింది. సినిమా చూస్తున్నంత సేపూ… సాక్షి టీవీలో స్పెషల్ బులిటెన్ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న ఫీలింగే కలుగుతుంటుంది. మధ్యమధ్యలో శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఎలివేషన్లు, టేకింగ్ లో క్వాలిటీ.. ఇవేం లేకపోతే, ఈ సినిమా కాస్త… ఎలక్షన్ కాంపెయిన్లానే మారేది. నటీనటుల ఎంపికలో మహి తన మార్క్ చూపించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్ ని జీవా మక్కీకి మక్కీ దింపేశాడు. సోనియమ్మ గెటప్ బాగుంది. శుభలేఖ సుధాకర్ ఇచ్చిన ఎలివేషన్లు అదిరాయి. కెమెరా, నేపథ్య సంగీతం చక్కని పనితీరు కనబరిచాయి.
ఫినిషింగ్ టచ్: రాజకీయ ప్రచార చిత్రం
తెలుగు360 రేటింగ్ : 2.5/5
-అన్వర్