వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరు..?
ఈ ప్రశ్న రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఎవరినైనా అడగండి..! మొదటి సమాధానం ఏమి వస్తుంది..? కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే సమాధానమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తండ్రి అనో.. వైఎస్ విజయమ్మ భర్త అనో… వైఎస్ రాజారెడ్డి కొడుకు అనో ఎవరూ చెప్పరు. అంటే.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంత ఇచ్చింది. ఆయనను మహా నేత చేసింది. ఓ సాధారణ “రూపాయి డాక్టర్”ను ముఖ్యమంత్రిని చేసింది. అమితమైన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే చాన్సిచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ వైఎస్ వారసుడు ఏమిచ్చారు..? ఆ కాంగ్రెస్సే అసలు విలన్ అనే బిరుదిచ్చారు. వందిమాగధులతో సినిమాలు తీయించి.. అసలు కుట్ర అంతా.. కాంగ్రెస్సే చేసిందనే అర్థంలో.. సినిమా తీసి ప్రజల ముందుకు వదిలారు.
కాంగ్రెస్లేకపోతే వైఎస్ ఎక్కడ ఉండేవారు..?
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుమతి లేకపోతే.. ఆ పార్టీలో ఏ చిన్న పదవి కూడా దక్కదు. సోనియా హయాంలో.. ఇది మరీ ఎక్కువగా ఉండేది. వాళ్లు ఇస్తేనే పదవులు వచ్చినట్లు లేకపోతే లేదు. వారి ప్రాపకం కోసం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేషాలు వేశారో.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లందరూ కథలు కథలుగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ అనే…చెట్టు నీడనే.. ఎవరైనా నేతలుగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నట్లుగా చూపి.. ఆ పార్టీని విలన్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పట్లో అనుమతి ఇవ్వకుండా వైఎస్ పాదయాత్ర చేసి ఉంటే.. ఇప్పటికి.. జగన్.. “రెడ్డి కాంగ్రెస్ ” అనే తండ్రి పెట్టిన పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఎందుకంటే.. అప్పట్లో తమను ధిక్కరిస్తే.. ఎంతటి వారినైనా కాంగ్రెస్ … బయటకు వెళ్లగొట్టేది. అందులో ఎలాంటి శషభిషలు ఉండేవి కావు. ముఖ్యంగా వ్యక్తిగత ఇమేజ్‌లు పెంచుకునేందుకు పార్టీని వాడుకునేవారిని అసలు క్షమించేది కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చింది కాబట్టే… వైఎస్ ప్రతీ చోటా కాంగ్రెస్ నినాదం చేశారు. హైకమాండ్‌ను భజన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన సినిమా ద్వారా.. తప్పంతా హైకమాండ్ దేనని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు.
హైకమాండ్ ప్రాపకం లేకుండానే వైఎస్ ఎదిగారా..?
“నేను హైకమండ్ కి విధేయుడనే కాని బానిసను కాదు” అని వైఎస్ క్యారెక్టర్‌తో చెప్పించడం అంటే… ఆత్మవంచన చేయడమే. కాంగ్రెస్ హైకమాండ్ పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు ఇలాంటి సంభాషణలు ఎన్నో రాశారు. పాదయాత్ర చేవెళ్ళలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసినంతవరుకు వైఎస్ఆర్ మెడలో కాంగ్రెస్ కండువా విడువలేదు. కాంగ్రెస్ కండువానే తలపాగాగా ఉంటుంది. కానీ సినిమాలో వైఎస్ పాత్రదారి మమ్ముట్టికి మామూలు కండువా వేశారు. దాన్ని కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. పైగా.. నీ పార్టీకి కాదు..నీకే ఓటు వేస్తామని… ఓ క్యారెక్టర్‌తో చెప్పింది.. వైఎస్‌ను మహానేతను చేసిన పార్టీని తీవ్రంగా అవమానించారు. ఇంకా హాస్యం ఏమిటంటే. హైకమండ్ ఇచ్చిన ఎమ్మెల్యేల లిస్టును వైఎస్ తిరస్కరించారట. కాంగ్రెస్ చరిత్రలో అలాంటి సీన్ ఉండే అవకాశమే లేదు. కానీ వైఎస్ ఏదో హైకమాండ్ మీద పోరాడినట్లు సీన్ క్రియేట్ చేశారు. అలాంటి పోరాటమే ఉండి ఉంటే.. వైఎస్ చనిపోక ముందే మాజీ ముఖ్యమంత్రి హోదాకు వచ్చి ఉండేవాళ్లు.
కాంగ్రెస్ దయ వల్ల కాదా.. జగన్ ఇప్పుడు రాజకీయ నేత అయింది..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు..? కాంగ్రెస్ నేత. తండ్రి చనిపోయిన సానుభూతిని వాడుకుని.. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి.. తండ్రి పేరుతో… అదే కాంగ్రెస్ పేరు పెట్టుకుని మరీ సొంత కుంపటి పెట్టుకున్న నేత. ఏపీలో కాంగ్రెస్ అంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ అని … చేసి.. కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచేసిన నేత. తండ్రిని… మహానేతను చేసిన పార్టీని నిట్టనిలువునా పాతరేసి… సొంత కుంపటి పెట్టుకున్న నేత. పెంచి పోషించిన పార్టీని… తనకు నడమంత్రుపు సిరి రావడానికి… కారణమైన పార్టీని.. ఆయన నిట్ట నిలువునా పాతిపెట్టారు. సినిమాలు తీయించి.. దుష్ప్రచారం చేయిస్తూ… విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు.
వైఎస్ ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం..! జగన్‌కు తెలియదా..?
సినిమా చివరిలో వైఎస్ మరణం తర్వాత జగన్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలి అని పిలుపునిస్తారు. ” వైఎస్ఆర్ ఆశయం” రాహుల్ గాంధీ ని ప్రధానిని చేయటం . ఆ విషయం… కొన్ని లక్షల సార్లు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి.. ఈ ఆశయ సాధనకు… తన తండ్రికి.. తనకు .. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం.. తండ్రి ఆశయాన్ని సాధించేందుకు నిలబడతారా..? నిలబడరా..?