తెలుగు360 రేటింగ్: 2.75/5
బయోపిక్‌లకు అర్థం మారుతోంది. ఇది వరకు బయోపిక్ అంటే.. ఓ వ్యక్తి జీవిత ప్రస్థానం. అందులో మంచి, చెడూ రెండూ చూపించేవారు. ఇప్పుడు కేవలం పాజిటీవ్ కోణాలే బయోపిక్‌లుగా మారుతున్నాయి. `యాత్ర` మరో రకమైన బయోపిక్. ఓ వ్యక్తి జీవితంలోని కేవలం ఓ భాగం కూడా తెరకెక్కించొచ్చు… అని `యాత్ర`తో చెప్పదలచుకున్నారు దర్శన నిర్మాతలు. ఆ భాగంలోనూ…కమర్షియాలిటికీ కావల్సిన హంగులు, కల్పనలు, డ్రామా జోడించొచ్చని చెప్పడానికి `యాత్ర` ఓ ఉదాహరణగా నిలుస్తుంది. వైఎస్ఆర్ జీవితాన్ని ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, ఈ కథలో రాజకీయ కోణాలుండడం, త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు రాబోతుండడం, దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు మమ్ముట్టి నటించడం.. `యాత్ర`పై ఫోకస్ పెరగడానికి కారణాలుగా నిలిచాయి. మరి ఈ యాత్ర ఎలా సాగింది? కనీసం ఓ వర్గాన్ని అయినా ఈ సినిమా సంతృప్తి పరచగలిగిందా?
కథ
2003లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికల్ని ప్రకటిస్తుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. ఆ సమయానికి బలహీనంగా ఉంటుంది. హైకమాండ్ సపోర్ట్ కూడా కాంగ్రెస్‌కి లభించదు. మరోవైపు అధికార పక్షంవైపే సర్వేలన్నీ మొగ్గు చూపిస్తాయి. పోరాటం చేయాలా? లేదంటే రాజకీయాల నుంచి నిష్క్రమించాలా? అనే సందిగ్థంలో ప్రతిపక్ష పార్టీ అధినేత రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) పోరాటానికే సిద్ధమవుతాడు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుడతాడు. ఆ పాద యాత్రలో వైఎస్ఆర్కి ఎదురైన అనుభవాలేంటి? తన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అధికారంలోకి తీసుకొచ్చాడు? అనే అంశాల చుట్టూ యాత్ర సాగుతుంది. పావురాల గుట్ట ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించడంతో కథ ముగుస్తుంది.
విశ్లేషణ
వైఎస్సార్ బయోపిక్ అనగానే ఆయన జీవితం మొత్తం తెరపై కనిపిస్తుందనుకుంటారంతా. కానీ.. `యాత్ర` అలాంటి కథ కాదు. పాద యాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయాన్ని ముందే చెప్పేసి – ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది చిత్రబృందం. ఏ బయోపిక్‌లో అయినా పాజిటీవ్ అంశాలే చూపిస్తారు. ఇక్కడా అంతే. వైఎస్‌ని హీరోగా చూపించడానికి ఎలాంటి సన్నివేశాలుండాలో.. అవన్నీ బాగా రాసుకున్నాడు మహి వి.రాఘవ. హై కమాండ్ని లక్ష్య పెట్టకపోవడం, వాళ్ల ఆదేశాల్ని ధిక్కరించి సొంత నిర్ణయాలు తీసుకోవడం, పాద యాత్రకు దారి తీసిన పరిస్థితులు ఇవన్నీ… వైఎస్‌ని హీరోగా చూపించేవే. కాకపోతే ఆయా సన్నివేశాలన్నీ ఎమోషన్ని పెంచడంలో దోహదం చేశాయి.
వైఎస్ఆర్ అనగానే ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, పించన్లు గుర్తొస్తాయి. ఇలాంటి హమీలు ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటి? అనే విషయాన్ని దర్శకుడు డ్రమెటిక్‌గా చూపించగలిగాడు. `రూపాయి డాక్టరు`గా వైఎస్‌ని మరోసారి గుర్తు చేశాడు. వైఎస్ – కెవీపీల మధ్య ఉన్న అనుబంధం బాగా చూపించగలిగారు. వైఎస్ తన అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చేవారో చూపించడానికి కొన్ని సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. చాలా మట్టుకు కల్పిత సన్నివేశాలే అనిపిస్తాయి. ఇవన్నీ నిజంగా వైఎస్ పాదయాత్రలో జరిగాయా? అనే అనుమానం కలుగుతుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకునే స్వేచ్ఛ దర్శకుడికి ఉండి ఉండొచ్చు. కానీ.. ఓ వ్యక్తి కథ చెబుతున్నప్పుడు జరిగిన విషయాలే చూపిస్తే బాగుండేది. తొలిభాగంలో వైఎస్ అభిమానులతో చప్పట్లు కొట్టించే సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. ద్వితీయార్థంలో ఆ ఫ్లో తగ్గింది. పతాక సన్నివేశాలు కూడా హడావుడిగా వచ్చి పడిపోయినట్టు అనిపిస్తాయి. హెలీకాఫ్టర్ ప్రమాదం, వైఎస్ఆర్ అంతిమ యాత్ర.. ఇవన్నీ అభిమానుల్ని కంట తడి పెట్టించే సన్నివేశాలే. బాబు పాత్రని ఫోన్ సంభాషణకే పరిమితం చేయడం `బ్రీఫ్డ్ మీ` అనే పదం వాడుకోవడం.. ఆకట్టుకుంటాయి. జగన్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆశ పడిన అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. `జగన్ బాబు వస్తున్నాడు` అనే ఒకే ఒక్క డైలాగ్ వినిపిస్తుంది.
నటీనటులు
ఇది మమ్మట్టి సినిమా. అలాంటి నటుడు ఉంటే… మిగిలినవాళ్లెవరూ కనిపించరు. ఈసారీ అదే జరిగింది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయాడు. ఇంకొంత కాలమైనా వైఎస్ అనగానే మమ్ముట్టి గుర్తుకురావడం ఖాయం. వైఎస్ హావాభావాల్ని కొన్ని చోట్ల పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో డ్రామా ఉన్నా.. అది మమ్ముట్టి నటనలో కనిపించదు. అంత సహజంగా నటించారు. మిగిలినవి చిన్న పాత్రలే. వీహెచ్గా కనిపించిన తోటపల్లి మధు ఆహార్యం, సంభాషణల్ని దించేశాడు.
సాంకేతిక వర్గం
వైఎస్ఆర్ జీవితంలో కేవలం ఓ భాగాన్ని మాత్రమే తీసుకున్నా – దానికి సినిమాటిక్ లక్షణాలు జోడించడంలో మహి విజయం సాధించడానే చెప్పాలి. అయితే అక్కడక్కడ ఆ డ్రామా ఎక్కువైనట్టు కనిపిస్తుంది. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్‌ని చూపించడానికే దర్శకుడు ఎక్కువ మగ్గు చూపాడు. రాసుకున్న సంభాషణలు సహజంగా ఉన్నాయి. పొలిటికల్ సెటైర్లు మరిన్ని వేసే అవకాశం ఉన్నా దర్శకుడు వాడుకోలేదు. సీతారామశాస్త్రి రాసిన పాట, అందులోని భావం.. రైతు కష్టాల్ని అక్షర బద్ధం చేసింది.
తీర్పు
రాబోయే ఎన్నికలలో తమ పార్టీకి ఈ సినిమా ఉపయోగపడుతుందని వైకాపా అభిమానుల ఆశ. కాకపోతే… ఈసినిమాలో
మెయిన్ విలన్ చంద్రబాబు కాదు. తెలుగుదేశం పార్టీ కానేకాదు. `అధిష్టానం` అనే పదం, ఆ పార్టీ ఆ స్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాకి ఎలాంటి ముప్పూ లేనప్పుడు – ఆ పార్టీని విమర్శించే సినిమా వస్తే ఏం లాభం..?
ఫైనల్ టచ్: వైఎస్ కోసం.. జగన్ అభిమానుల కోసం
తెలుగు360 రేటింగ్: 2.75/5