ఆధారాలతో సహా టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలను బయటపెడతామంటూ.. ఉదయం నుంచి మీడియా అందరికీ.. చాలా ఉత్కంఠగా ఎదురు చూసేలా.. చెప్పిన వైసీపీ నేతలు.. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చూపించిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. అందులో ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించకపోగా… రాజధాని పరధిలో కాకుండా.. కృష్ణా జిల్లాలో కొన్న భూములను కూడా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జాబితాలో చేర్చారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ కంతేరులో పధ్నాలుగు ఎకరాలు కొన్నదని మరోసారి వైసీపీ నేతలు వీడియో ప్రదర్శించారు. మ్యాప్ కూడా చూపించారు. అందులోనే రాజధాని ఏరియాకు.. కంతేరుకు చాలా దూరం కనిపిస్తోంది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే.. టీడీపీ గెలిచినప్పటి నుండి రాజధాని ప్రకటించే మధ్య కాలంలో జరిగిన లావాదేవీలు. ఈ మధ్య కాలంలో.. నాలుగు వేల ఎకరాలకుపైగా.. లావాదేవీలు జరిగినట్లుగా.. వైసీపీ నేతలు వీడియో చూపించారు. రావెల కిషోర్, కొమ్మాలపాటి శ్రీధర్, పరిటాల సునీత, నారాయణలను కూడా చూపిస్తూ.. భూములు కొన్నారని ఆరోపించారు. ఇవన్నీ.. చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలే. వీటికి ఆధారాలుగా డాక్యుమెంట్లను చూపిస్తారేమోనని మీడియా అంతా ఎదురు చూసింది. కానీ ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు చూపించలేదు కానీ.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలతో.. ఓ డాక్యుమెంటరీని మాత్రం ప్రదర్శించారు.
ఆధారాలతో సహా నిరూపిస్తామని.. వైసీపీ నేతలు చెప్పే సరికి.. మీడియా అంతా ఎంతో ఆసక్తి ప్రదర్శించింది. అందరూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. తీరా.. పాత ఆరోపణలను కొత్తగా వీడియో రూపంలో చెప్పి ఊసూరుమనిపించారు. నిజానికి బుగ్గన అసెంబ్లీలో ఆరోపణలు చేసినప్పుడే.. దాదాపుగా అందరూ వివరణ ఇచ్చారు. తాము రాజధాని ప్రకటించక ముందో.. ప్రకటించిన తర్వాతో కొన్నామన్నారు. వారు ఇచ్చిన వివరణకు భిన్నంగా.. వారు ఫలానా సమయంలోనే భూములు కొన్నారని.. డాక్యుమెంట్లు చూపిస్తారేమోనని.. జర్నలిస్టులు భావించారు. ఎందుకంటే.. ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటివేమీ లేకుండా… సాక్షి టీవీలో వచ్చే ఓ ఆరోపణల వీడియోను ప్రదర్శించి.. అవే సాక్ష్యాలు అనుకోమన్నారు వైసీపీ నేతలు.