ఆవును.. ఈ మాట ఎవరో అనడం లేదు. వైసీపీ నేతలే ఈ వ్యాఖ్యలను జగన్ వద్దకు చేర్చాలని ఊబులాటపడుతున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా బలపరిచితే, వైసీపీ మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించకుండా సైలెంట్ గా ఉండిపోవడం ఆ పార్టీ నేతలకే నచ్చడం లేదు.
ఏపీ రాజధాని అమరావతి అని ప్రజలు ఏకపక్ష తీర్పును ఇచ్చేశారు. మూడు రాజధానుల జాబితాలో ఉన్న కర్నూల్ , విశాఖ ప్రాంత ప్రజలు కూడా దీన్ని బలపరిచారు. ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో కూటమికి వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం. అయినా, వైసీపీ ఇంకా మూడు రాజధానులపై తక్షణ నిర్ణయాన్ని వెలువరించకుండా జాప్యం చేస్తోంది.
మరో రెండు రోజుల్లోనే గ్రాండ్ గా అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల విషయంలో వైసీపీ స్వరం మారిందా? అని మరోసారి చర్చ జరుగుతోంది. మండలిలో రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అయినా ఇప్పటివరకు నో క్లారిటీ.
దీంతో..వైసీపీ ఇంకా మూడు రాజధానులకే కట్టుబడే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని వైసీపీ కట్టర్ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలే మూడు రాజధానుల ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి బొక్కాబోర్ల పడింది వైసీపీ. అయినప్పటికీ ఈ కీలక సమయంలో రాజధానిపై ఇంకా పాత పాటే పాడితే.. రాజకీయాల్లో వైసీపీకి ఇక స్కోప్ ఉండదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంతానికి పోకుండా అమరావతికి జైకొట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.