రఘురామకృష్ణరాజును ఎలాగైనా దెబ్బకొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సానుకూల ఫలితాలు రావడం లేదు. నేరుగా దెబ్బకొట్టినా.. ఆయనను వెనుకడుగు వేసేలా దెబ్బకొట్టడానికి అవసరమైన వ్యూహం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన ఆర్థిక మూలాలపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజుకు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇండ్ భారత్ పేరుతో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అనేక అక్రమాలకు పాల్పడ్డాయని.. ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు నేరుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదుచేశారు.
పూర్తి వివరాలతో ఇండ్ భారత్ కంపెనీ రూ. 940 కోట్ల మేర ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని లేఖ పంపారు. ఈ లేఖపై విజయసాయిరెడ్డితో సహా 15మంది ఎంపీలు సంతకాలు చేశారు. వైఎస్ హయాంలో ఆర్థికంగా ఎదిగిన వైఎస్ ఆత్మీయ పారిశ్రామికవేత్తల్లో రఘురామ ఒకరు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మ అని పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు. ఇండ్-భారత్ పేరుతో పలు కంపెనీలు పెట్టి.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐకేసులు కూడా నమోదయ్యాయి. వీటి గురించి… విజయసాయిరెడ్డికి పూర్తిగా తెలుసు. ఆయన సలహాలు.. సూచనలు కూడా రఘురామ వ్యాపార ప్రస్థానంలో ఉన్నాయని చెబుతూంటారు. అయితే.. రఘురామ వ్యాపారంలో జరిగిన సీక్రెట్లన్నీ సీబీఐ కేసులు..విచారణలతో వెలుగులోకి వచ్చాయి.
అవన్నీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌తో పాటు కోర్టుల్లోనూ ఉన్నాయి. బ్యాంకులు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇందులో కొత్తవేమీ లేదు. అయితే ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి, ప్రధానికి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడం వెనుక.. ఆయనపై మరింత ఒత్తిడి పెంచే వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. ఎలాగైనా ఆయనను కట్టడి చేయాలనుకుంటున్న వైసీపీకి ఇదో అస్త్రం అనుకుంటున్నారు.