తెదేపా ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించడంతో వైకాపా ఎమ్మెల్యేలని ఆకర్షించడం మొదలుపెట్టింది తెదేపా. తమ పార్టీ ఎమ్మెల్యేలని తెదేపా ఎత్తుకుపోతుండటంతో దానిని అడ్డుకొనేందుకు రాజధానిలో తెదేపా నేతల భూబాగోతాలను బయటపెట్టారు. అదే సమయంలో ముద్రగడ కూడా మళ్ళీ ప్రభుత్వానికి జగన్ బాషలో లేఖ వ్రాయడంతో ఆయనను కూడా జగనే ప్రభుత్వంపైకి ఉసిగొల్పారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈరోజు కూడా జగన్ సొంత మీడియా సాక్షిలో రాజధాని భూబాగోతాలలో చాలా మంది తెదేపా నేతల పేర్లను బయటపెట్టింది. ఈరోజు జాబితాలో మంత్రి నారాయణ (3,129), ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ (4.09), స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు (17.3) ఎకరాల భూమిని, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర రూ.5కోట్లు విలువయిన పోరంబోకు భూమిని తమ బినామీల పేరిట కొన్నట్లు పేర్కొంది. దానిలో ఆ బినామీలు ఎవరెవరి వద్ద నుండి ఎంతెంత విస్తీర్ణం ఉన్న భూమిని కొనుగోలు చేసారో కూడా పేర్కొంది. ఈ భూబాగోతంలో ప్రధాన పాత్ర పోషించింది మంత్రి నారాయణేనని సాక్షి పేర్కొంది. వైకాపా తరపున సాక్షి మీడియా చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలకు వారందరూ ఏమని సమాధానం చెపుతారో చూడాలి. అలాగే ఈ ఆరోపణల ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫిరాయింపులని ప్రోత్సహించడాన్ని తెదేపా తాత్కాలికంగా నిలిపివేస్తుందా లేక వైకాపా వేసిన ఈ ఎత్తుకి పైఎత్తు వేసి ముందుకు సాగుతుందో చూడాలి.