వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రాయలసీమ పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు కనిష్ట స్థాయి కంటే దిగువ నుంచి తెలంగాణా ప్రభుత్వం నీళ్ళు తరలించుకుపోయేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మకి నీరెత్తినట్లు చూస్తూ కూర్చొన్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణాకి తాకట్టు పెట్టేశారని విమర్శించారు. ఈ కారణంగా భవిష్యత్ లో రాయలసీమకి చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డిల్లీలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున బలంగా వాదించలేకపోవడాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి తప్పు పట్టారు.
రాయలసీమకి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైకాపా వాదిస్తుంటే, పట్టిసీమ ద్వారా సీమ జిల్లాలకి నీళ్ళు అందించి తమ ప్రభుత్వమే న్యాయం చేస్తోందని తెదేపా వాదిస్తోంది. వారి వాదోపవాదాలు కొనసాగుతుండగానే, శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా నదీ జలాలను తరలించుకుపోవడానికి తెలంగాణా ప్రభుత్వం శరవేగంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులని నిర్మిస్తోంది. దాని వలన రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకి అన్యాయం జరుగుతుందని అధికార, ప్రతిపక్షాలకి తెలుసు. రెండూ కలిసి వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా దానిపై కూడా రాజకీయాలు చేసుకొంటూ, ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి. కనుక రాయలసీమకి రెండు పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నట్లే భావించవచ్చు. కనుక ఈ విమర్శలు, ప్రతివిమర్శలు అన్నీ కూడా వారి రాజకీయాలలో భాగంగానే చూడాలి తప్ప వారు రాయలసీమ కోసం ఆవేదన చెందుతున్నట్లు భావించనవసరం లేదు