ఆ మద్యన వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులు చాలా జోరుగా సాగుతున్న సమయంలో “ఆ జిల్లా నుంచి నలుగురు..ఈ జిల్లా నుంచి ముగ్గురు మా పార్టీలో చేరబోతున్నారంటూ తెదేపా నేతలు మీడియాకి లీకులు ఇస్తూ వైకాపాతో మైండ్ గేమ్ ఆడేవారు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లుగా ఉండేది అప్పుడు తెదేపా, వైకాపాల పరిస్థితి. కారణాలు ఎవయితేనేమి చాలా రోజులుగా వైకాపా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఆగిపోయాయి. మళ్ళీ రాజ్యసభ ఎన్నికలలో నాలుగవ అభ్యర్ధిని కూడా నిలబెట్టాలనుకొంటునట్లు తెదేపా ప్రకటించడంతో, మళ్ళీ ఆ రెండు పార్టీల మద్య మాటల యుద్ధం మొదలయింది. కానీ, తరువాత ఆ ఆలోచన విరమించుకావడంతో అది వైకాపాతో మైండ్ గేమ్ ఆడేందుకే ఆవిధంగా డ్రామా ఆడిందని స్పష్టమయింది. ఇవాళ్ళతో రాజ్యసభ అభ్యర్ధులు నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది కనుక ఇప్పుడు వైకాపా కూడా నిశ్చింతగా ఉంది. అందుకే ఇప్పుడు అది కూడా తన బుర్రకి పదునుబెట్టి, మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లుంది.
వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్య ముగ్గురూ ఇవ్వాళ్ళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీలో నుంచి తెదేపాలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. పార్టీ మారి చాలా పొరపాటు చేశామని పశ్చాతాపపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే మళ్ళీ పార్టీలోకి వచ్చేయాలని అనుకొంటున్నారు. వాళ్ళ పేర్లు సరైన వైకాపా సమయంలో వెల్లడిస్తాము,” అని అన్నారు.
తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలకి ఆ పార్టీలో పార్టీలో నేతలతో ఘర్షణలు, చేదు అనుభవాలు ఎదురవుతున్న మాట వాస్తవం. కానీ వాళ్ళు తెదేపా నుండిచి ఏదో లబ్ది పొందేఉంటారు కనుక ఆ పార్టీ నుంచి బయటపడాలనుకొన్నా అది అంత తేలిక కాదు. కనుక వాళ్ళందరూ మళ్ళీ వైకాపాలోకి వెళ్లిపోవాలంటే కనీసం వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూడక తప్పదు. కనుక వైకాపా నేతలు తెదేపాతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.