వైసీపీ పద్దెనిమిది మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో పట్టభద్రుులు, గ్రాడ్యూయేట్ స్థానాల్లో పోటీ చేస్తున్న నలుగురు రెడ్డి అభ్యర్థులు లేరు. ఆ స్థానాలు కాకుండానే ఇతర పద్దెనిమిది మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించారు. నిజానికి ఇప్పుడు జరుగుతోంది ఎనిమిది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే. కానీ భవిష్యత్లో జరగాల్సిన వాటికి కూడా ఇప్పుడే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఆరేడు నెలల తర్వాత అప్పుడేం జరుగుతుదో ఎవరికీ తెలియదు. వారికే టిక్కెట్లు ఇస్తారో లేదో చెప్పలేరు. కానీ బీసీలకు , ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామని చెప్పుకోడానికి పర్సంటేజీల లెక్కలు సరిపోవడానికి పద్దెనిమిది మందితో జాబితా విడుదల చేశారు.
ఇటీవల వైసీపీలో చేరిన జయ మంగళ వెంకటరమణకు షాకిచ్చారు. ఆయనకు స్థానిక సంస్థ కోటాలో టిక్కెట్ ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే కోటాలో ఇస్తామని చెప్పుకొచ్చారు. ఆ కోటా ఎన్నికలు మూడు, నాలుగు నెలల తర్వాత జరగనున్నయి. విడదల రజనీని గెలిపిస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్ ను నాలుగేళ్ల తర్వాత జగన్ గుర్తించారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే మంత్రి పదవి విడదల రజనీ నుంచి తీసుకుని మర్రి రాజశేఖర్ కు ఇస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వాలి కాబట్టి .. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏసురత్నంకు ఎమ్మెల్సీ ప్రకటించారు.
జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. జగన్ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేయవచ్చని చెబుతున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని కూడా ఇప్పుడే ప్రకటించారు. ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఒక్కొక్కటిగా భర్తీ అవుతూంటాయి. తాము మొత్తం పదకొండు మంది బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి ఈ జాబితా రిలీజ్ చేసినట్లుగా ఉంది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ.. సజ్జల రామకృష్ణారెడ్డి.. తాము ఎంత శాతంలో బీసీలకు పదవులు ఇచ్చామో.., జగన్ ఎంత ఇచ్చారో చెప్పుకొచ్చారు. గట్టిగా యాభై మంది ఎమ్మెల్సీలు ఉన్న చోట.. శాతాల్లో చెప్పాల్సిన అవసరం ఏందో.. ఆయనకే తెలియాలి.