తెదేపాలోకి వెళ్ళిపోయినా వైకాపా ఎమ్మెల్యేలకు వైకాపా చాలా ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేసింది. వైకాపా తరపున ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ ప్రతిపాదన చేసారు. ఆయన ఏమ్మనారంటే, “పార్టీని వీడి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు తమని తెదేపాలోకి ఎందుకు తీసుకుందో ఈపాటికి గ్రహించే ఉంటారు. దాని అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అయ్యింది కనుక తక్షణమే అందరూ వెనక్కి తిరిగి వచ్చి పార్టీలో మీ స్థానాలను తిరిగి చేపట్టామని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం ఒక కుటుంబ సభ్యుల వంటి వాళ్ళం. ఒక్కోసారి కుటుంబ సభ్యులు పొరపాట్లు చేస్తుండవచ్చు కానీ వాటిని మేము తీవ్రంగా పరిగణించడం లేదు. తెదేపా మీకు ఏవో ప్రలోభాలు చూపి, బెదిరించి భయపెట్టి నయాన్నో భయాన్నో పార్టీలోకి రప్పించుకొందని మాకు తెలుసు. కనుక తెదేపాలోనే ఉంటూ అవమానాలు ఎదుర్కొంటూ ప్రజల దృష్టిలో సిగ్గులేని రాజకీయ నేతలుగా మిగిలిపోయే బదులు మళ్ళీ వైకాపాలోకి తిరిగి వచ్చి మీ గౌరవం నిలబెట్టుకోండి. మీ తప్పుల్ని మన్నించి మళ్ళీ మిమ్మల్ని ఆదరించడానికి వైకాపా సిద్ధంగా ఉంది. ఒకవేళ రాదలుచుకోకపోతే దయచేసి మీరు వైకాపా ద్వారా పొందిన మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికలకి వెళ్లి మీకు ప్రజల ఆదరణ ఉందని నిరూపించుకొండి. లేకుంటే ప్రజల దృష్టిలో మీరు సిగ్గులేని రాజకీయ నేతలుగా నిలిచిపోతారు,” అని అన్నారు.
నిన్నమొన్నటి వరకు వారిని “మీరు సంతలో డబ్బుకు అమ్ముడుపోయే పశువుల వంటివారు..మీకు సిగ్గుశరం, రోషం లేదు,” అని జగన్ తో సహా వైకాపా నేతలు చాలా మంది దూషించడం అందరూ విన్నారు. వారంరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైకాపా స్పీకర్ కి విజ్ఞప్తులు చేసింది. వారిపై జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి పిర్యాదు చేసారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. వాళ్ళు తమను మోసం చేశారనే ఆవేదనతో, అయినా వాళ్ళని ఏమీ చేయలేని అసహాయతతో వైకాపా ఆవిధంగా వ్యవహరించడం సహజమే.
వాళ్ళకి ఒక్కొక్కరికీ తెదేపా 20-30 కోట్లు, రాజధాని ప్రాంతంలో భూములు, కాంట్రాక్టులు ఇచ్చి వశపరుచుకొందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చాలాసార్లు ఆరోపించారు. అదే నిజమనుకొంటే ఇప్పుడు వాళ్ళు ఏవిధంగా వెనక్కి తిరిగిరాగలరు? ఒకవేళ తిరిగి వెళ్లిపోదలిస్తే తెదేపా చూస్తూ ఊరుకోదు కదా? పైగా ఇప్పుడు దగ్గర్లో ఎన్నికలు కూడా లేవు. కనుక వాళ్ళు వెనక్కి తిరిగిరావడం అసంభవమే. ఇప్పుడు పార్టీలు మారినవాళ్ళు తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేయకపోయినా వాళ్ళని న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. రాజకీయాలలో సిద్దాంతాలు, నీతి నిజాయితీ, నైతిక విలువలు, ఆత్మాభిమానం వంటి పదాలను ప్రసంగాలలో చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో ఎక్కడా ఇప్పుడు కనబడవు. కనుక పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని ఆశించడం అత్యాశ, అవివేకమే అవుతుంది.