వైకాపా ఎమ్మెల్యేలు వరుసగా తెదేపాలో చేరడం, ఆ తరువాత వారిపై అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ వైకాపా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కి వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేయడం ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలని పార్టీని వీడి వెళ్ళిపోకుండా ఆపలేకపోతున్నారు. వెళ్ళిపోయిన వారిపై అనర్హత వేటు వేయమని వైకాపా చేస్తున్న విజ్ఞప్తులని స్పీకర్ పట్టించుకోవడం లేదు. పట్టించుకోరని కూడా తెలుసు. అయినా విజ్ఞప్తులు చేస్తూనే ఉంది.
ఇటీవల తెదేపాలో చేరిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మళ్ళీ నిన్న వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి స్పీకర్ కి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళారు. స్పీకర్ లేకపోవడంతో వాళ్ళు శాసనసభ డిప్యూటీ కార్యదర్శి బాలకృష్ణమాచారికి ఆ వినతి పత్రం ఇచ్చి వచ్చేరు.
విశేషం ఏమిటంటే, వారితో బాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళారు. ఆయన ఈ నెల 18న తెదేపాలో చేరుతారంటూ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. వాటిని ఆయన గట్టిగానే ఖండించారు. కానీ ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కనుక ఆయన నిజంగానే ఖండిస్తున్నారో లేదో 18న గానీ తేలదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎస్వీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చిత్రాలను కూడా వారు సమర్పించారు. ముంజేతి కంకణం చూసుకోవడానికి అద్దం ఎందుకన్నట్లు, ముఖ్యమంత్రే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు మళ్ళీ దానికి వేరేగా ఆధారాలు అనవసరం. కానీ శాస్త్రం ఒప్పుకోదు కనుక ఆధారాలు తప్పనిసరి. అవన్నీ కట్టకట్టి అటకమీద పడేయడం షరా మామూలే. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయడమే. రాజకీయ పార్టీలే దీని బాధితులు అయినప్పటికీ అవి కూడా చట్ట సవరణకు ఒప్పుకోవు. కనుక ఈ సమస్యను అవి ఎప్పటికీ భరించక తప్పదు.