వైకాపా నుండి తెదేపాలో మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుని ఈరోజు కలిసి శాస్త్ర ప్రకారం ఒక విజ్ఞప్తిని ఆయన చేతిలో పెట్టి వచ్చేరు. ఆ తరువాత ‘స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారించుతూ చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పవలసిన మరో ముక్క కూడా చెప్పేసారు.
కానీ ఆయన వారిపై వేటు వేయరాని వారికీ తెలుసు…మీడియాకి తెలుసు…ప్రజలకి కూడా తెలుసు. పార్టీ మారేవారిపై అనర్హత వేటు పడుతుందనే భయం ఉన్నట్లయితే అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే సాహసమే చేయరు కదా?అలాగే పార్టీలో చేరేవారిపై అనర్హత వేటు వేసుకోవాలని ఏ పార్టీ కోరుకోదు కూడా. వారి చేరికతో పార్టీ ఇంకా బలపడాలని ఆశిస్తున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీ కోరింది కదా అని ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ స్పీకర్ వారిపై వేటు వేస్తారని ఆశించడం అత్యాసే అవుతుంది. అసలు స్పీకర్ కోడెల శివప్రసాద రావుపైనే తమకు నమ్మకం లేదంటూ ఆయనకే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైకాపా మళ్ళీ ఆయనకే ఈ విజ్ఞప్తిని కూడా చేయవలసి రావడం విచిత్రంగానే ఉంది. పైగా ఆయన తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించాలని ఆశించడం మరీ విడ్డూరంగా ఉంది.
అయితే ఇది మన రొటీన్ రాజకీయ ఫార్ములా ప్రకారం చేయవలసిన ‘తంతు’ గాబట్టే ఇవ్వన్నీ చేసి వైకాపా తరువాత కార్యక్రమాలకి రంగం సిద్దం చేసుకొంటోందని చెప్పవచ్చును. స్పీకర్ ఎలాగూ వారిపై అనర్హత వేటు వేయరు కనుక తరువాత జగన్మోహన్ రెడ్డి దీని గురించి మీడియాతో తన ఆవేదన పంచుకోవడం, ఆ తరువాత దీని కోసం ఆయన తన ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొని గవర్నరుని, వీలయితే ప్రధానిని, రాష్ట్రపతిని కలవడం వంటి కార్యక్రమాలన్నీ మున్ముందు చూడవచ్చును. ఇంకా దీనికి ‘హైప్’ అవసరమని ఆయన భావిస్తే హైకోర్టులో ఒక పిటిషన్ కూడా తగిలిస్తే ఈ వ్యవహారం గురించి మీడియాలో చాలా రోజులు చర్చ కొనసాగుతుంది.
ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమను ఆదరించి, గెలిపించిన పార్టీకి రాజీనామాలు చేయకుండా వేరే పార్టీలో చేరడం, దానిని ఆ పార్టీలు ఆమోదించడం, స్పీకర్ ఈ చట్ట వ్యతిరేక వ్యవహారంపై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దానిపై ఏళ్లతరబడి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపట్టడం వంటివన్నీ కూడా మన ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేసే చర్యలే. ఇటువంటి వ్యవహారాలలో స్పీకర్ ని ప్రశ్నించడానికి మన న్యాయస్థానాలకు అధికారం లేకపోవడంతో ఇది అక్రమమని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నెలకొని ఉంది. స్పీకర్ కూడా అధికార పార్టీకి చెందిన వారే అయ్యుండటం చేత ఆయన చట్ట ప్రకారం పూర్తి స్వతంత్రుడిగా పైకి కనిపిస్తునప్పటికీ, ముఖ్యమంత్రిగా కొనసాగే పార్టీ అధ్యక్షుడి కనుసన్నలలోనే మెలగవలసిన దుస్థితి నెలకొని ఉంది. ఆ కారణంగానే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులను కూడా చూసి కూడా చూడనట్లు మౌనం వహించాల్సి వస్తోంది. చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, స్పీకరే ఈవిధంగా వ్యవహరిస్తుంటే ఇక ఇతరులు ఆ చట్టాల పట్ల ఏవిధంగా గౌరవిస్తారు?