వైకాపాకి సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని, అక్కడయితేనే ఇటువంటి విషయాలపై త్వరగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని చెప్పి కేసుని వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి భాజపాతో చేతులు కలిపినందుకు 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేయగా దానిని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. అదే ప్రకారం పార్టీ ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేకపాటి తన పిటిషనులో సుప్రీం కోర్టుని కోరారు.
ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు కటినంగా వ్యవహరించింది కనుక వైకాపా ఎమ్మెల్యేల విషయంలో కూడా అదేవిధంగా తీర్పునిస్తుందని వైకాపా ఆశించింది. కానీ ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలపై మొదట స్పీకర్ అనర్హత వేరు వేసిన తరువాతనే హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ ఆ నిర్ణయాన్ని సమర్ధించాయనే విషయాన్నీ వైకాపా పట్టించుకోకుండా సుప్రీం కోర్టుకి వెళ్లి భంగపడింది. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలపై కేవలం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రమే చర్య తీసుకొనే హక్కు కలిగి ఉన్నారు. స్పీకర్ పరిధిలో ఉన్న ఇటువంటి సమస్యపై హైకోర్టు, సుప్రీం కోర్టు కలుగజేసుకొనేందుకు వీలు లేదు కనుకనే అవి అందుకు ఇష్టపడవు. ఆ సంగతి తెరాసలో చేరిన కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేల విషయంలో గతంలోనే స్పష్టమయింది. ఒకవేళ న్యాయస్థానాలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే అవకాశమే ఉండి ఉంటే, ఒక్క ఎమ్మెల్యే కూడా అటువంటి సాహసం చేసి ఉండేవారు కాదు. ఈ సంగతి వైకాపాకి తెలియకపోదు. అందుకే ఆ విచక్షణాధికారం ఎన్నికల అధికారికి లేదా ఎన్నికల కమీషన్ కి కట్టబెట్టాలని డిమాండ్ కూడా చేస్తోంది. అన్నీ తెలిసికూడా సుప్రీం కోర్టు వెళ్ళి భంగపడటం ఎందుకో?