చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ నామినేషన్లు వేసేవారిపై జరుగుతున్న దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దాడుల ఘటనలు ఎక్కువగా పుంగనూరులోనే చోటు చేసుకున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ అనే తేడా లేకుండా.. నామినేషన్లు వేస్తేనే అందర్నీ వెంటపడి కొట్టారు అధికార పార్టీ నేతలు. దొరికితే పత్రాలు చించేశారు. ధైర్యంగా పేపర్లు ఫైల్ చేస్తే.. అధికారుల వద్ద నుంచి లాక్కుని చించేశారు. ఇప్పుడు ఇదే పద్దతిని మున్సిపల్ నామినేషన్లలోనూ ఫాలో అవుతున్నారు.
ఒకటో వార్డు కౌన్సిలర్‌గా విజయలక్ష్మి అనే మహిళ టీడీపీ తరపున నామినేషన్ వేయడానికి వచ్చింది. తన వద్ద ఉన్న పత్రాలు వైసీపీ నేతలు లాక్కుంటారన్న ఉద్దేశంతో .. ఆమె వారికి కనిపించకుండా దుస్తుల్లో దాచి పెట్టుకుంది. కానీ వైసీపీ నేతలు వదిలి పెట్టలేదు. ఆమె దుస్తుల్లో చేతులు పెట్టారు. ఆమె వద్ద ఉన్న పేపర్లు లాక్కుని… చించేశారు. వైసీపీ కార్యకర్తలు… ఇలా అసభ్యంగా ప్రవర్తించడంలో విజయలక్ష్మి మనస్తాపానికి గురై… కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదంతా జరుగుతున్న పోలీసులు అక్కడే ఉన్నారు. పుంగనూరులో ఎన్నిదాడులు జరుగుతున్నా.. చూస్తూ ఉండిపోతున్న పోలీసులు.. ఆ ఘటన జరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఉండిపోయారు.
పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఆయన స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకూడదని.. ఎకగ్రీవంగా గెలిపించుకోవాలని… అనుచరులను పెట్టి… దాడులకు పురికొల్పుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జడ్పీటీసీల్లో మూడు ఏకగ్రీవం అయ్యాయి. అన్ని చోట్లా… దాడులు, బెదిరింపులే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ బరి తెగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.