ఏపీలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని .. ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు ఎవరో కూడా ఖరారయిందని ఒకరు మహిళా మంత్రి అని చెబుతున్నారు. నవంబర్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
తాను హెచ్చరికలు ఇచ్చిన తర్వాత అయినా మంత్రులు బయట టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ముఖ్యమంత్రి కుటుంబం జోలికి టీడీపీ ఎందుకు రావడం అని బొత్స ఒక్కరే స్పందించారు. మిగతా మంత్రులు మాట్లాడలేదు. దీంతో ఉదయమే ముగ్గుర్ని తొలగించబోతున్నట్లు.. నవంబర్‌లో ముహుర్తం పెట్టినట్లుగా లీక్ ఇచ్చారు. అయితే అత్యధిక శాతం మంత్రులు మాత్రం.. మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.
జగన్ గత ఏప్రిల్‌లోనే కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు తీసుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పదకొండు మంది పాతవారికే అవకాశం కల్పించారు. అవకాశం లభించని వాళ్లని పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. తర్వాత వారు సైలెంటయ్యారు. వారి ప్లేస్‌లో మంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్‌గా ఉంటున్నారు. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. రోజా ఉన్నప్పటికీ.. ఆమె విమర్శల ద్వారా ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువ అన్నభావన ఉంది. ఇతర మంత్రులు నోరు తెరవడం లేదు. దీంతో జగన్ అసహనానికి గురువుతున్నారు.