భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో టీడీపీ ప్రకటించిన ఆరు హామీల గురించి వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. తెల్లవారక ముందే మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు. తన లాంగ్వేజ్ లో ప్రసంగించారు. ఇతర వైసీపీ నేతల సంగతి చెప్పాల్సి పని లేదు. టీడీపీ మేనిఫెస్టో ఇదీ.. అని చెప్పి వీటిని చేయేలేరనో.. లేకపోతే ఇప్పటికే అమలు చేస్తున్నామనో చెబుతున్నారు. దీంతో కూలీ మీడియాగా ప్రచారంలో ఉన్న చానళ్లలో టీడీపీ మేనిఫెస్టో విస్తృతంగా ప్రచారంలోకి వస్తోంది.
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు. సజ్జల భార్గవ అయితే తన ఫోర్స్ మొత్తాన్ని టీడీపీ మేనిఫెస్టో కమిటీ ప్రచారానికే వినియోగిస్తున్నారు. వారు చేసేది నెగెటివ్ ప్రచారమే కావొచ్చు కానీ.. టీడీపీ హామీలు మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎవరు చెప్పేవి నమ్ముతారన్నది ప్రజల చాయిస్. నెగెటివ్ గానో పాజిటివ్ గానో.. టీడీపీ మేనిఫెస్టో మాత్రం. ప్రజల్లోకి వెళ్లిపోతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకునేది ఇదే. హామీలు జనంలోకి విస్తృతంగా వెళ్లిపోతే.. చాలని అనుకుంటారు. ఆ పనిని వైసీపీ కూడా చేస్తూండటంతో టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు.
టీడీపీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని కాకుండా..ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారని.. సామాన్యులకు వచ్చే సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. సంపద పెంచుతామని అంటున్నారు. చంద్రబాబు టైంలో సంపద ఎలా పెరిగింతో విశ్లేషిస్తూ గణాంకాలు డాక్యుమెంట్లు పెడుతున్నారు. ఇలా రెండు వైపు్లా టీడీపీ మేనిఫెస్టోకు విస్తృత ప్రచారం లభిస్తోంది.